హలో కలెక్టర్ గారు.. జిల్లాలో అభివృద్ధి ఎలా జరుగుతోంది?

హలో కలెక్టర్ గారు.. జిల్లాలో అభివృద్ధి ఎలా జరుగుతోంది?
  • ములుగు కలెక్టర్​ను ఇంటర్వ్యూ చేసిన ప్రైమరీ స్కూల్​ స్టూడెంట్లు
  • ఇంగ్లీష్​లో ప్రశ్నలు అడగడంతో సంబురపడ్డ దివాకర టీఎస్​ 

ములుగు, వెలుగు: ‘హలో కలెక్టర్ గారు​ ఎలా ఉన్నారు? ములుగు జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? పేద విద్యార్థుల అభివృద్ధి చేస్తున్న ప్రణాళికలేంటి?’ అంటూ ములుగు కలెక్టర్  దివాకర టీఎస్​ను చిన్నారులు ఇంగ్లీష్​లో ప్రశ్నించారు. ఇందేంటి అనుకుంటున్నారా? నిజమే.. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ములుగు కలెక్టరేట్​లో దిశ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈఎల్ఎఫ్​ ఇంగ్లీష్​ లర్న్​ టు రీడ్​ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కలెక్టర్​ను ఇంటర్వ్యూ చేశారు.

 ఇంగ్లీష్ లో పలు ప్రశ్నలు అడగడంతో పాటు బాలల దినోత్సవ ప్రాముఖ్యతపై చిన్న రోల్  కూడా ప్లే చేశారు. దీంతో సంబురపడ్డ కలెక్టర్​ వారిని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. చదువే ధ్యేయంగా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలని, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితేనే మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చని తెలిపారు. 

దిశ ఫౌండేషన్  భాగస్వామ్యంతో జిల్లాలోని 72 ప్రైమరీ స్కూళ్లలో ఇంగ్లీష్  నేర్పిస్తున్నట్లు చెప్పారు. ములుగు, బంజరుపల్లి ప్రైమరీ స్కూల్​ స్టూడెంట్లు, టీచర్​ అరుణ్ కుమార్, దిశ ఫౌండేషన్  కో ఆర్డినేటర్  ఎండీ ముబీన్, సునీల్ కుమార్  పాల్గొన్నారు.