ఎవర్​గ్రీన్​ షిప్పును పక్కకు తప్పించేందుకు నెదర్లాండ్స్​, ఇటలీ..  తలో చెయ్యి

ఎవర్​గ్రీన్​  షిప్పును పక్కకు తప్పించేందుకు నెదర్లాండ్స్​, ఇటలీ..  తలో చెయ్యి
  • ఎవర్​గ్రీన్​ను పక్కకు తప్పించేందుకు 2 టగ్​బోట్లు
  • ప్రయత్నాలు బెడిసికొడితే సరుకు అన్​లోడింగ్​

సూయజ్​:  సూయజ్​ కాల్వలో అడ్డంగా ఇరుక్కుపోయిన ఎవర్​ గ్రీన్​ (ఎవర్​గివెన్​) నౌకను పక్కకు తప్పించేందుకు నెదర్లాండ్స్​, ఇటలీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే అక్కడ కొన్ని టగ్​బోట్లు.. ఎవర్​గ్రీన్​ను పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా, వాటికి తోడుగా ఆ రెండు దేశాలు రెండు టగ్​బోట్లను అక్కడకు పంపించాయి. సూయజ్​ కెనాల్​లో ఎవర్​గ్రీన్​ షిప్పు మంగళవారం  చిక్కుకుపోవడంతో వేల కోట్ల రూపాయల వ్యాపారం నిలిచిపోయింది. ఆసియా దేశాల నుంచి యూరప్​కు, యూరప్​ దేశాల నుంచి ఆసియాకు సరుకు రవాణాపై తీవ్రంగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే వీలైనంత తొందరగా షిప్పును పక్కకు తీసే పనిలో పడ్డారు.  షిప్పును పక్కకు లాగడం, షిప్పు అడుగు భాగంలోని ఇసుకను  తొలగించడం ద్వారా ఎవర్​గ్రీన్​ను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆదివారం కొంచెం గాలులు పెరగడం, అలల వేగం కూడా ఎక్కువగా ఉండడంతో తొందరగానే షిప్పును తొలగించేందుకు అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. ఒకవేళ ఈ ప్రయత్నమూ ఫెయిలైతే షిప్పులోని కొంచెం సరుకును కిందకు దించేసి.. పక్కకు లాగి చూడనున్నట్టు సూయజ్​ కెనాల్​ సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు. అదే జరిగితే.. షిప్పును తప్పించేందుకు మరికొన్ని రోజులు టైం పట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక, సూయజ్​ మార్గానికి దూరంగా ఉంటున్నాయి కొన్ని షిప్పింగ్​ కంపెనీలు. వేరే మార్గాల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. షిప్​ ఎప్పుడు పక్కకు తొలుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నాయి.