
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. దాదాపు నాలుగున్నర నెలల్లో 47 లక్షల మంది కరోనా బారినపడ్డారు. అందులో మూడు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో ప్రపంచంలో అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, మాల్స్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలు అన్నీ బంద్ అయ్యాయి. కంపెనీలు, పరిశ్రమల్లో పనులు నిలిచిపోయాయి. అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో అప్పటికే మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బపడింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఎదురైన ఈ సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించారు.
ఈ ఐదు రోజుల్లో రూ.11 లక్షల కోట్లు
స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రధాని ప్రకటించిన ఈ ఉద్దీపన ప్యాకేజీ వివరాలను బుధవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు వివరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ మొత్తం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ఆదివారం చివరి పార్ట్ మీడియా సమావేశంలో వెల్లడించారామె.
ఈ ఐదు రోజులు 11 లక్షల 2 వేల 650 కోట్ల రూపాయల స్టిములస్ ప్యాకేజీ ప్రకటించినట్లు చెప్పారు. తొలి రోజు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహాలు, వడ్డీ రాయితీలు, ఈపీఎఫ్ నిబంధనల్లో మార్పులు, ఎన్బీఎఫ్సీలకు లిక్విడిటీ, టీడీఎస్ రేట్ల తగ్గింపు వంటి వాటికి మొత్తం రూ.5,94,550 కోట్లు ప్రకటించారు. రెండో రోజు వలస కార్మికులకు రెండు నెలల పాటు ఉచిత రేషన్, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు లోన్లు, నాబార్డ్ ద్వారా అదనపు వర్కింగ్ క్యాపిటల్, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు రుణాలు వంటివాటికి రూ.3,10,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్.
మూడో పార్ట్ లో పీఎం మత్య సంపద యోజన, అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, చిన్న తరహా ఆహార పరిశ్రమలు, పాడి పరిశ్రమలో మౌలిక సదుపాయాల కల్పన సహా వ్యవసాయ సంబంధ రంగాలకు రూ.1,50,000 కోట్లు ప్రకటించారు. ఇక నాలుగు, ఐదు రోజుల్లో కలిపి వివిద రంగాల్లో సంస్కరణలకు రూ.48,100 కోట్లు కేటాయించారు.
అయితే గత నెలలో ప్రకటించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన కింద రూ.1,92,800 కోట్లు వేర్వేరు మార్గాల్లో ప్రజలకు అందించినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. అలాగే గత నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.8,01,603 కోట్ల ఉద్దీపనలను ప్రకటించిందని గుర్తుచేశారామె. కరోనా లాక్ డౌన్ తర్వాత మొత్తంగా 20 లక్షల 97 వేల 53 కోట్ల రూపాయల ఉద్దీపనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు.
Here is the summary of all the announcements so far, totalling over Rs 20 lakh crores (5/5)#AatmaNirbharApnaBharat pic.twitter.com/i2HVhYabj2
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 17, 2020