వరద నీటిలో ఖిలా .. నీటమునిగిన కాకతీయుల వారసత్వ సపంద

వరద నీటిలో ఖిలా ..  నీటమునిగిన కాకతీయుల వారసత్వ సపంద
  • నానడంతో పలుచోట్ల ధ్వంసమైన రాతికట్టడం
  • వరద నీరు పోయేలా చర్యలు శూన్యం

వరంగల్‍, వెలుగు: కాకతీయుల వారసత్వ సంపద వరద నీటిలో నానుతోంది. నాటి ఓరుగల్లు రాజధాని చెరువును తలపిస్తోంది. రాతి, మట్టి కోట ప్రాంతాల్లో వాననీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు చేయకపోవడంతో  పిల్లర్లు కుంగుతున్నాయి.  800 ఏండ్లనాటి శిల్పసంపదను కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అద్భుత కట్టడాల భవిష్యత్‍ అగమ్యగోచరంగా మారింది.

వరద నీటిలో.. కాకతీయ కళాతోరణాలు

సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో  ఖిలా వరంగల్‍ కోట ప్రాంగణం చెరువును తలపిస్తోంది. నాలుగు కాకతీయ తోరణాల మధ్య ఉండే సౌండ్‍ అండ్‍ లైటింగ్‍ ఏరియా వరద నీటితో నిండిపోయింది. లేజర్‍ షో జరిగే ఈ ప్రాంతమంతా జలమయమైంది. వరంగల్​ పేరు చెప్పగానే గుర్తొచ్చే నాలుగు కాకతీయ కళాతోరణాలు, అరుదైన ఏనుగు విగ్రహాలు, నర్తకీల నాట్యమందిరం, కట్టడాలు మొత్తం వరదనీటిలో నానుతున్నాయి. కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశామంటున్న ప్రభుత్వం వానకాలంలో వచ్చే వరద అక్కడినుంచి వెనువెంటనే బయటకు వెళ్లే పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో సినిమా షూటింగులు, దేశవిదేశాల నుంచి టూరిస్టులు వచ్చి ఫొటోలు దిగే నాటి కాకతీయుల ప్రధాన ఖిల్లా రోజుల తరబడి నీటిలో నానుతోంది. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఇలానే వదిలేస్తే తోరణాలు, శిల్పాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. మరోవైపు నాలుగు తోరణాల ప్రాంతానికి కిలోమీటర్‍ దూరంలో చుట్టూరా ఉండే మట్టికోట ఇప్పటికే చాలాచోట్ల దెబ్బతినగా.. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు రాతికోటలోని రాళ్లు పలుచోట్ల ఊడి కిందపడ్డాయి.

మాటలకే పరిమితమైన మంత్రి కేటీఆర్‍ 

గతే ఏడాది జులై 7న రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకతీయ వారసుడు కమల్​చంద్ర భంజ్‍దేవ్‍ను వరంగల్‍ కోటకు ఆహ్వానించారు. అనంతరం అదేరోజు సాయంత్రం  హైదరాబాద్‍లోని మాదాపూర్‍లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‍లో ఆయనతో కలిసి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‍ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‍ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కాకతీయుల వారసత్వాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఎనిమిదేండ్లలో కాకతీయుల శిల్పకళ సంపద, కట్టడాల రక్షణకు చర్యలు తీసుకోకపోవడంపట్ల సిగ్గు పడుతున్నట్లు చెప్పారు. ఎన్ని నిధులు ఖర్చయినా కావాల్సిన చర్యలు తీసుకుని భవిష్యత్‍ తరాలకు కాకతీయుల గొప్పదనాన్ని అందిస్తామని ప్రకటించారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తే మంత్రి కేటీఆర్​ మాటలు చేతల దాకా రాలేదని స్పష్టమవుతోంది.