పదేళ్ల తర్వాత.. ప్రేక్షకుల ముందుకు అబ్బాస్

పదేళ్ల తర్వాత.. ప్రేక్షకుల ముందుకు అబ్బాస్

దాదాపు మూడు దశాబ్ధాల క్రితం ‘ప్రేమదేశం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్.. మొదటి మూవీతోనే సూపర్ సక్సెస్‌‌ను అందుకోవడంతో పాటు తెలుగులోనూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత యాభైకి పైగా సినిమాలు చేసిన అబ్బాస్.. పలు కారణాల వలన  కొన్నాళ్లుగా  ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు.  ఆయన చివరిగా హీరోగా  నటించిన తమిళ చిత్రం ‘రామానుజన్’ 2014లో విడుదల కాగా,  ఆయన కీలక పాత్ర పోషించిన  మలయాళ మూవీ ‘పచ్చ కల్లం’  2015లో రిలీజ్ అయ్యింది. 

అంటే దాదాపు  పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు అబ్బాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జీవీ ప్రకాష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లవర్’ చిత్రంలో అబ్బాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  దర్శకుడు ప్రదీప్‌‌ రంగనాథన్‌‌ దగ్గర  అసిస్టెంట్‌‌గా పనిచేసిన మరియరాజా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 

శ్రీగౌరి ప్రియ హీరోయిన్‌‌గా నటిస్తోంది. 90స్‌‌లో లవర్ బాయ్‌‌గా  లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అబ్బాస్ మొదటి వరుసలో ఉండేవాడు. లాంగ్ గ్యాప్ తర్వాత తన నుంచి రాబోతున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.