సినీ ఇండస్ట్రీని కాపాడి తీరుతాం

సినీ ఇండస్ట్రీని కాపాడి తీరుతాం

విజయవాడ: సినిమా ఇండస్ట్రీని తప్పకుండా కాపాడి తీరుతామని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై జారీ చేసిన జీవో రద్దును డివిజన్ బెంచ్ లో ఏపీ ప్రభుత్వం అప్పీల్ చేయనున్న నేపథ్యంలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ల ధరల అంశంలో తాను చేయగలిగింది చేశానన్నారు. తాము అన్నింటికీ సిద్ధమయ్యే అఖండ సినిమాను రిలీజ్ చేశామన్నారు. అఖండ సక్సెస్ సాధించిన నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలసి విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు బాలయ్య. టిక్కెట్ల రేట్ల సమస్య, అఖండ విజయం గురించి ఆయన స్పందించారు. కఠిన పరిస్థితుల్లోనూ తమ పనితనాన్ని గుర్తించి ప్రేక్షకులు అఖండను హిట్ చేశారన్నారు. 

‘అఖండ మూవీ బాగా వచ్చింది. దీంతో టిక్కెట్ల ధరలపై హైకోర్టు తీర్పు రాకున్నా మేం ధైర్యంగా సినిమాను రిలీజ్ చేశాం. సినిమాల విడుదల విషయంలో అందరూ సందిగ్ధంలో ఉన్న టైమ్ అది. కానీ మేం రిలీజ్ చేశాం. ప్రేక్షకులు, అమ్మ వారి ఆశీస్సులతో అఖండ ఘన విజయం సాధించింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సినీ పరిశ్రమను కాపాడటానికి కట్టుబడి ఉన్నాం’ అని బాలయ్య స్పష్టం చేశారు.