
జిమ్ లో తరచూ వర్కౌట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో ఆప్ లోడ్ చేస్తున్న వీడియోలపై మహేశ్ బాబు క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మధ్య వరుసగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలను షేర్ చేయడంతో రాజమౌళి సినిమా కోసమే మహేష్ కష్టపడుతున్నారని ఫ్యాన్స్ అనుకున్నారు. రాజమౌళి మూవీ కోసం ఇప్పటి నుంచే మహేశ్ కష్టపడుతున్నారని మీడియా వాళ్లు కూడా రాసుకొచ్చారు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మహేశ్‌బాబు ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
జిమ్‌లో వర్కవుట్ చేసే వీడియోలు, ఫొటోలు చాలా రోజుల నుంచే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నానని చెప్పారు మహేష్ బాబు. డైరెక్టర్ రాజమౌళితో కొత్త సినిమా ఇంకా ప్రారంభం కాలేదని, దానికి సమయం ఉందన్నారు. ఒకవేళ ఆ సినిమా కోసం కసరత్తులు చేయడం స్టార్ట్ చేస్తే.. ఆ విషయాన్ని తానే స్వయంగా చెబుతానన్నారు.
బిగ్ సి మొబైల్స్ ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బిగ్-సి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేశ్ ఈవెంట్‌లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. సినిమాను తప్పనిసరిగా సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తప్పనిసరిగా వచ్చే సంక్రాంతికి గుంటూరు కారం సినిమాను తీసుకొస్తామన్నారు. వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడం ద్వారా వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పటి నుంచి ఏదో ఒక విధంగా చిన్నపిల్లలకు సాయం చేయాలని అనుకున్నానని, అందుకే చిన్నారుల గుండె ఆపరేషన్లకు తన వంతు సహకారం అందిస్తున్నానని చెప్పారు.
తన సినిమాల రీ-రిలీజ్‌ల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా చిన్నారుల సాయం కోసమే ఇచ్చేస్తున్నామన్నారు మహేష్ బాబు. అందరిలానే తానూ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగానే ఉపయోగిస్తానని చెప్పారు. ఫోన్ చూసే సమయాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నానని తెలిపారు. మీ మొబైల్ రింగ్ టోన్ ఏంటి అని అడుగుతున్నారని, తనది సైలెంట్ టోన్ (నవ్వుతూ) చెప్పారు. తనకు సంబంధించిన వస్తువులన్నీ తన భార్య నమత్ర కొనుక్కొని తీసుకొస్తుందన్నారు. ఫారిన్ కు వెళ్లినప్పుడు మాత్రం తానే షాపింగ్ చేస్తారట. అది తనకు ఎంతో హ్యాపీనెస్ కల్గిస్తుందన్నారు మహేశ్‌బాబు.