
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ లుక్కే కాదు.. ఇమేజ్ కూడా మారిపోయింది. క్యూట్ లవర్ బోయ్ అనిపించుకున్నవాడు కాస్తా ఒక్కసారిగా మాస్ అండ్ యాక్షన్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం చేస్తున్న ‘రెడ్’ కూడా ఆ తరహా సినిమాయే. గతంలో రామ్‌కి నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి మంచి చిత్రాలిచ్చిన కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ ‘తాడమ్’కి రీమేక్. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లు. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ రెండు పాటలు తీస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఒక పాట తీస్తే సినిమా పూర్తయిపోతుంది. ఏప్రిల్ 9న సినిమా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ తర్వాత రామ్ చేయబోయే ప్రాజెక్ట్ కూడా కన్‌ఫర్మ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘వెంకీమామ’తో విజయం అందుకున్న బాబి డైరెక్షన్‌లో రామ్ నటించనున్నాడట. నిజానికి అతడు పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ తయారు చేశాడని, ఆయన డైరీ ఆల్రెడీ ఫుల్ కావడంతో రామ్‌కి ఆ కథ చెప్పడం, అతడు ఓకే అనడం జరిగాయని టాలీవుడ్ టాక్. ‘రెడ్’ అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. హీరోయిజమ్‌ని ఎలివేట్ చేస్తూనే ఎమోషన్స్‌తో ఆకట్టుకోవడం బాబి శైలి. మరి రామ్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశాడో చూడాలి.