
కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. తుళు నటుడు-హాస్యనటుడు రాకేష్ పూజారి 33 సంవత్సరాల వయసులో ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. రాకేష్ పూజారి కాంతారా 2లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను పాత్రకి సంబంధించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ రాకేష్ పూజారి మృతి పట్ల ఎమోషనల్ అయ్యారు రిషబ్ శెట్టి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
" మీరు మా జీవితాల్లో ఒక భాగం మాత్రమే కాదు, మా హృదయాలపై లోతైన ప్రభావాన్ని చూపారు. మీ చిరునవ్వు, మాటలు మరియు ఉనికి.. మీ చుట్టూ ఉన్నవారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించాయి. మీరు భౌతికంగా మాతో లేకపోయినా, మీ జ్ఞాపకాలు మా హృదయాల్లో శాశ్వతంగా ఉంటాయి.
నా మనసులో మీరు ఎప్పటికీ అద్భుతమైన కళాకారుడివి. కాంతార సినిమాలో నీ పాత్ర, ఆ క్యారెక్టర్‌లో నటిస్తున్నప్పుడు నీ ముఖంలో మెదిలిన చిరునవ్వు, ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతాయి. ఇది కళాకారుల సమాజానికి తీరని నష్టం.. ‘మిత్రమా.. మళ్లీ జన్మించు’.. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక. అలాగే, ఈ షాక్‌ను తట్టుకునే శక్తిని దేవుడు మీ కుటుంబానికి ప్రసాదించాలని" రాకేశ్ కుటుంబానికి హీరో రిషబ్ శెట్టి సానుభూతి తెలిపారు.
నటుడు రాకేశ్ మే 11, సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్టు కన్నడ నటుడు శివరాజ్ కేఆర్ వెల్లడించారు. ఉడిపి జిల్లాలోని కర్కల తాలూకాలోని నిట్‌లో తన స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరైన రాకేష్.. మెహిందీ ఫంక్షన్‌లో ఉన్నట్లుండి కుప్పకూలిపొయాడు. దీంతో అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాకేష్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రాకేష్ ఆకస్మిక మరణం అతని అభిమానులను మరియు సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ನೀನು ನನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಎಂದೆಂದಿಗೂ ಒಬ್ಬ ಅದ್ಭುತ ಕಲಾವಿದ. ಕಾಂತಾರ ಸಿನಿಮಾದಲ್ಲಿ ನಿನ್ನ ಪಾತ್ರ ಹಾಗು ಅದನ್ನು ನಿರ್ವಹಿಸುವಾಗ ನಿನ್ನ ಮುಖದ ನಗು ನನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ಎಂದೆಂದಿಗೂ ಶಾಶ್ವತ. ಕಲಾವಿದ ವರ್ಗಕ್ಕೆ ಇದೊಂದು ತುಂಬಲಾರದ ನಷ್ಟ .. ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬಾ ಗೆಳೆಯ ..
— Rishab Shetty (@shetty_rishab) May 12, 2025
ನಿನ್ನ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ. ದೇವರು ಈ ಆಘಾತವನ್ನು ಸಹಿಸುವ… pic.twitter.com/x2Cev99kGi
ఇకపోతే, రాకేష్ ఇటీవలే కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. కాంతారా చిత్రానికి ప్రీక్వెల్ అయిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించారు. రాకేశ్ కామెడీ ఖిలాడిగల సీజన్ 3లో విజేతగా నిలిచి మంచి పేరు సంపాదించాడు.
ఇటీవలే కాంతారా 2 మళయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) ప్రమాదవశాత్తు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన సినిమా సెట్‌లో జరగలేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటికే, కాంతారా 2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి పలు వరుస ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం కొల్లూరులోనే జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు సడెన్ గా బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. అందులో కొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా ఓ సారి గాలి వాన రావడం వల్ల నిర్మించిన భారీ సెట్ కూలిపోయింది. అప్పుడు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇలా కాంతారా 2 సినిమా మొదలు.. చివరి వరకు ఏం జరుగుతుందో అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.