మహిళల వాష్ రూంలో కెమెరా..యజమానిపై కూడా కేసు

మహిళల వాష్ రూంలో కెమెరా..యజమానిపై కూడా కేసు
  • మైనర్ నిందితుడు జువెనైల్ హోమ్ కు తరలింపు 

హైదరాబాద్: జూబ్లిహిల్స్ లోని  వన్ డ్రైవ్ ఇన్ లో.. మహిళల వాష్ రూమ్ లో సీక్రెట్ గా మొబైల్ కెమెరా పెట్టిన నిందితుడు మైనర్ బాలుడితోపాటు ఘటనకు బాధ్యుడిగా యజమాని పై కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 సమయంలో 25 ఏళ్ల యువతి భోజనం చేసేందుకు రోడ్ నంబర్ 10 లో ఉండే  డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టుకు వెళ్లింది. బాత్ రూమ్ కు వెళ్ల గా బాత్ రూమ్ సీలింగ్ లో మొబైల్ ఫోన్ ను గుర్తించింది. వెంటనే బయటకు వచ్చి డ్రైవ్ ఇన్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. 
యువతి ఫిర్యాదు తీసుకున్న జూబ్లి హిల్స్ ఎస్.ఐ నవీన్ రెడ్డి కేసు నమోదు చేసి విచారించారు. డ్రైవ్ ఇన్ లో పనిచేసే మైనర్ బాలుడు.. ఈ పని చేసినట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదరు ఫుడ్ కోర్టు  డ్రైవ్ ఇన్ యజమాని పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ నవీన్ రెడ్డి తెలిపారు. వాష్ రూమ్ లో పెట్టిన మొబైల్ ఫోన్ లో మొత్తం నాలుగు గంటలపాటు వీడియో ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితుడు పది రోజుల క్రితమే మొబైల్ ను కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. మొబైల్ ను ఫోరెన్సిక్ నిమిత్తం పంపించామని,  పలు సెక్షన్ల కింద 354 సీ, ఐపీసీ 509, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని ఎస్.ఐ తెలిపారు.