అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు కమిటీ .. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన

అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు కమిటీ .. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన

హైదరాబాద్ సిటీ, వెలుగు: గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కోసం ఆరుగురు ఉన్నతాధికారులతో  కమిటీ వేసినట్టు హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం తెలిపారు. కమిటీలో మెంబర్లుగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఉంటారని చెప్పారు. 

ఈ కమిటీ సమగ్ర విచారణ చేపట్టి  ప్రమాదం సంభవించడానికి గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు సమగ్ర నివేదికను సమర్పిస్తుందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్ లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనలు తయారు చేసే బాధ్యతలు ఈ కమిటీ చూస్తుందన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన  అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్షించి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారన్నారు.