
- బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్‌లో పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోష్ దిశానిర్దేశం
- సెంటిమెంట్‌తో లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తుండని ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం బీజేపీదేననే లక్ష్యంతో పని చేయాలని రాష్ట్ర నేతలకు పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి సానుకూల వాతావరణం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. సర్కార్ వైఫల్యాలపై, కేసీఆర్ అవినీతి, అక్రమాలపై ఉద్యమాలు, పోరాటాలు చేయాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర నేతలు చేసే పోరాటానికి కేంద్ర నాయకత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని, అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణపై జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందనే విషయాన్ని మరువరాదన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా బీఎల్ సంతోష్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.
ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవద్దు
సెంటిమెంట్‌తో కేసీఆర్ మళ్లీ రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని, అయినా ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితుల్లో లేరని బీఎల్ సంతోష్ అన్నారు. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు కేసీఆర్ పెద్ద మొత్తంలో డబ్బులు పంపించాడని, ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుండేదని చెప్పారు. కేసీఆర్‌కు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చేందనే చర్చ ప్రజల్లో సాగేదని, ఆయన అవినీతి, అక్రమాలపై ప్రజలు విస్తృతంగా చర్చించుకునే అవకాశం ఉండేదన్నారు. ఇలాంటి ఏ అవకాశాన్ని బీజేపీ నేతలు వదలుకోవద్దని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చన్నారు. ‘‘కష్టపడండి.. జనంలోకి వెళ్లండి.. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను, మోడీ సర్కార్ సక్సెస్ ను ఇంటింటికి వెళ్లి వివరించండి. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి ఎలా తీసుకురావాలనేది మాకు వదిలేయండి’’ అని సూచించారు. పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలని సూచించారు. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం ఉండాలని, గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా, రాష్ట్ర పార్టీ నేతలదేనన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు హైదరాబాద్ ను అంటిపెట్టుకొని ఉండవద్దని, నిత్యం జనంలో ఉండాలని, వారికి అండగా మనం ఉన్నామనే భరోసాను కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతి జిల్లా అధ్యక్షుని పనితీరుపై తన వద్ద రిపోర్టు ఉందని, పని చేయని జిల్లా ప్రెసిడెంట్ లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సంతోష్ హెచ్చరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, పార్టీ సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఇంద్రసేనా రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.