బీజేపీ లీడర్ల డైలాగ్ వార్​పై హైకమాండ్ సీరియస్

బీజేపీ లీడర్ల డైలాగ్ వార్​పై హైకమాండ్ సీరియస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై పార్టీలో కొనసాగుతున్న డైలాగ్ వార్​పై బీజేపీ హైకమాండ్​ సీరియస్ అయింది. బీజేపీ స్టేట్ ‘ప్రెసిడెంట్’ పోస్టుపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించింది. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనను మళ్లీ కేంద్రమంత్రి పదవి వరించడంతో, అధ్యక్ష పదవిపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. కొత్తగా వచ్చిన వాళ్లు, పాత వాళ్లు అంటూ కమలం పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి.. వేర్వేరు వాదనలూ వినిపిస్తున్నారు. 

కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇవ్వొద్దని, పార్టీ సిద్ధాంతం గురించి తెలిసిన వారికే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఓ గ్రూపు పట్టుపడుతోంది. అయితే, బీజేపీలోకి కొత్తగా వచ్చిన వారైనా సరే.. వారి రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని మరో గ్రూపు వాదిస్తోంది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​కు ప్రెసిడెంట్ పోస్టు ఇస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో, సంఘ్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయ పార్టీకి సంపూర్ణ విజయం దక్కాలంటే కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు అవసరమని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యానించారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు.  దేశం, ధర్మంపై అవగాహన ఉన్న వాళ్లకే అధ్యక్ష పదవి ఇవ్వాలని, ముఖ్య నేతలతో చర్చించిన తర్వాతే పేరు ప్రకటించాలని జాతీయ నాయకత్వానికి సూచించారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి స్పందిస్తూ..  ఇది పార్టీ అంతర్గత అంశమని దాటవేశారు. అయినా నేతలు, కార్యకర్తల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. 

డైలాగ్​ వార్​పై హైకమాండ్​ ఆరా

ఈ విషయంపై జాతీయ నాయకత్వం  ఆరా తీసింది.  ప్రెసిడెంట్ పోస్టుపై ఎవ్వరూ మాట్లాడొద్దని ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బస్సల్ ఫోన్​ చేసినట్టు తెలిసింది. నేతలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, ఎవ్వరూ అధ్యక్ష పదవి విషయంంలో కామెంట్లు చేయొద్దని చెప్పినట్టు సమాచారం. ఎవరిని నియమించాలో దానిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం 
చేసినట్టు తెలిసింది.