టికెట్ రేట్లు పెంచుకోండి..చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

టికెట్ రేట్లు పెంచుకోండి..చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 
  • సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఓజీ, గేమ్‌‌ ఛేంజర్, పుష్ప2కు మాత్రమే వర్తిస్తాయని వెల్లడి
  • సినిమా కేవలం వినోదమే.. నిత్యావసరం కాదు  
  • మూవీ చూడాలా? వద్దా? అన్నది ప్రేక్షకుల ఇష్టం 
  • చూడాలనుకుంటే ఎంత ధరైనా పెడ్తరు.. లేదంటే 
  • వారం తర్వాత వెళ్తారని కామెంట్

 హైదరాబాద్, వెలుగు: కొత్త సినిమాల టికెట్ రేట్ల పెంపుకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. టికెట్‌‌‌‌ రేట్ల పెంపుపై గతంలో దాఖలైన పిటిషన్లు తేలేదాకా.. భవిష్యత్తులో వచ్చే కొత్త సినిమాల టికెట్​రేట్లు పెంచేందుకు అనుమతించరాదంటూ సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కేవలం ఓజీ, గేమ్‌‌‌‌ ఛేంజర్, పుష్ప-2కు మాత్రమే వర్తిస్తాయని చెప్పింది. దీంతో చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్’, ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాలకు ఊరట దక్కింది. 

టికెట్‌‌‌‌ ధరల పెంపును నిలిపివేస్తూ, ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లపై తేలేదాకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదంటూ గతేడాది డిసెంబర్ 9న సింగిల్‌‌‌‌ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రాజాసాబ్, మన శంకరవరప్రసాద్‌‌‌‌ సినిమాల నిర్మాతలు అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌‌‌‌ గాడి ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌తో కూడిన బెంచ్‌‌‌‌ బుధవారం విచారణ చేపట్టింది. 

ఇవీ వాదనలు.. 

మొదట నిర్మాతల తరఫు అడ్వకేట్లు వాదనలు వినిపి స్తూ.. ‘‘సింగిల్‌‌‌‌ జడ్జి ముందున్న పిటిషన్లలో మేం ప్రతివా దులుగా లేము. ఎవరో వేసిన పిటిషన్‌‌‌‌లో మేం ఇంప్లీడ్‌‌‌‌ కాదలచుకోలేదు. అందుకే అప్పీలు దాఖలు చేశాం. టికెట్‌‌‌‌ ధరల పెంపుపై వ్యక్తిగతంగా పిటిషన్‌‌‌‌లు దాఖ లు చేశారు. వాటిపై సింగిల్‌‌‌‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశా రు. అఖండ -2పై సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఇదే హైకోర్టు ఇంతకుముందు నిలిపివేసింది. 

సింగిల్‌‌‌‌ జడ్జి ఉత్తర్వుల వల్ల మా కొత్త సినిమాల టికెట్‌‌‌‌ ధరల పెంపునకు అనుమతించాలంటూ ఇచ్చిన వినతిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు” అని చెప్పారు. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘చట్టవిరుద్ధంగా అనుమతులు ఇవ్వడంపైనే సింగిల్‌‌‌‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. 

చట్ట నిబంధనల అమలు చేయాలనే మేం కోరుతున్నాం. అర్ధరాత్రి దాటిన తరువాత సినిమాలను ప్రదర్శిస్తున్నారు.. ఇది చట్ట విరుద్ధం” అని అన్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ.. టికెట్‌‌‌‌ ధరలను పెంచుతూ భవిష్యత్తులో ఎలాంటి మెమోలు జారీ చేయొద్దన్న ఉత్తర్వులను అమలు చేస్తున్నామన్నారు. వాదనలను విన్న కోర్టు.. ‘‘సినిమా అనేది వినోదం. 

తాగునీళ్ల వంటి నిత్యావసరమేమీ కాదు. అందువల్ల సినిమా చూడాలా? వద్దా? అన్నది ప్రేక్షకుల విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. వాళ్లు చూడాలనుకుంటే ఎక్కువ ధరైనా సరే  వెళతారు.. లేదంటే వారం తరువాత వెళ్తారు” అని వ్యాఖ్యానించింది. ‘‘టికెట్‌‌‌‌ ధరల పెంపు వ్యవహారంలో సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలు గేమ్‌‌‌‌ ఛేంజర్, ఓజీ, పుష్ప2కు మాత్రమే వర్తిస్తాయి. పిటిషన్‌‌‌‌లోని చట్టపరమైన అంశాల పూర్వాపరాల్లోకి మేం వెళ్లడం లేదు. వాటిని సింగిల్‌‌‌‌ జడ్జి వద్దనే తేల్చుకోండి” అంటూ అప్పీళ్లపై విచారణను మూసివేసింది.