బాధితులకు భూపరిహారం ఎందుకు ఇయ్యలే?

బాధితులకు భూపరిహారం ఎందుకు ఇయ్యలే?
  • కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా?
  • పలువురు అధికారులపై హైకోర్టు ఆగ్రహం
  • వ్యక్తిగతంగా విచారణకు  హాజరు కావాలని ఆదేశం
  • విచారణ వచ్చే నెల 3కి వాయిదా

హైదరాబాద్, వెలుగు : దశాబ్దాలు గడిచినా మురికివాడల్లోని ప్రజల నుంచి సేకరించిన భూమికి పరిహారం ఎందుకు ఇవ్వలేదని అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా పరిహారం ఇవ్వకపోవడం ఏమిటని నిలదీసింది. కోర్టు ధిక్కరణ ఉత్తర్వులు అందుకున్నాక ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరిస్తూ అఫిడవిట్‌‌  దాఖలు చేసే తీరిక కూడా లేదా అని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. పరిహారం కోసం 70 నుంచి 80 ఏండ్లు దాటిన వృద్ధులు కోర్టుకు వస్తున్నారని, అలాంటి వారికి కూడా పరిహారం ఇవ్వాలనిపించలేదా అని చీవాట్లు పెట్టింది. ఆగస్టు 3న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని గతంలో హైదరాబాద్‌‌ కలెక్టర్​గా పనిచేసిన అమోయ్‌‌ కుమార్, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్‌‌  లోకేశ్  కుమార్, జీహెచ్‌‌ఎంసీ భూసేకరణ అధికారి వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని పేర్కొన్నది. 

కోర్టు ఉత్తర్వులు అమలుచేస్తే ధిక్కరణ కేసు ఉండదని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. హైదరాబాద్‌‌లోని ఎస్‌‌ఆర్‌‌ నగర్‌‌ లో సేకరించిన భూమికి పరిహారం చెల్లించాలని 2022 జులైలో డివిజన్‌‌  బెంచ్‌‌ ఇచ్చిన తీర్పును అమలు చేయకపోవడంతో మహేశ్  మోహన్‌‌లాల్‌‌ సహా ఆరుగురు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ను చీఫ్‌‌  జస్టిస్‌‌  ఉజ్జల్‌‌  భూయాన్, జస్టిస్‌‌ ఎస్‌‌.నందతో కూడిన బెంచ్‌‌ మంగళవారం విచారించింది. అధికారుల వైఖరిలో మార్పు రాకపోతే నాన్‌‌బెయిల్‌‌బుల్‌‌ వారంట్‌‌  జారీ చేస్తామని హెచ్చరించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆఫీసర్లను తమ ఎదుట హాజరుపర్చాలని డీజీపీకి ఉత్తర్వులు ఇస్తామని కూడా తెలిపింది. 

కాగా,  ఎస్ఆర్‌‌ నగర్‌‌ లోని బాపు నగర్‌‌లో 58, 59, 60 సర్వే నంబర్లలోని మురికివాడలో 44,359 చదరపు గజాల భూ సేకరణకు 1988లో ప్రభుత్వం నోటిఫికేషన్‌‌  ఇచ్చింది. భూమిని తీసుకున్న ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని మహేశ్  మోహన్‌‌లాల్​తో పాటు కొంతమంది 2001లో హైకోర్టును ఆశ్రయించారు. 4 శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని 2004లో సింగిల్‌‌  జడ్జి తీర్పు చెప్పారు. ఆ తీర్పును ఆఫీసర్లు సవాల్‌‌ చేశారు. 18 ఏండ్ల పెండింగ్‌‌ తర్వాత హైకోర్టు సింగిల్‌‌ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. 1988 నుంచి 4 శాతం వడ్డీ, ఆ తర్వాత 15 శాతం వడ్డీతో పరిహారాన్ని 4 వారాల్లో చెల్లించాలని గత ఏడాది జులై 18న తీర్పు చెప్పింది.