ఆర్టీసీ సమ్మెపై విచారణ: ఇద్దరికీ హైకోర్టు అక్షింతలు

ఆర్టీసీ సమ్మెపై విచారణ: ఇద్దరికీ హైకోర్టు అక్షింతలు

విలీనం పట్టుబడితే కష్టమని కార్మికులకు సూచన

అంగీకారం కాదు.. ముందు చర్చిస్తే ఏమన్న కార్మికుల లాయర్

ప్రభుత్వం ఎందుకు చొరవ చూపట్లేదని ప్రశ్నించిన హైకోర్టు

ప్రజల ఇబ్బందుల్ని మరోసారి ప్రస్తావించిన ధర్మాసనం

డెంగ్యూతో ప్రాణాలు పోతున్నాయి.. సర్కార్ బాధ్యత తీసుకుంటుందా?

తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు

ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై వివరణ కోరిన ధర్మాసనం

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై అటు ప్రభుత్వానికి, ఇటు కార్మికులకు అక్షింతలు వేసింది హైకోర్టు. విలీనంపైనే పట్టుపట్టి కూర్చుంటే కష్టమని కార్మికులకు చెప్పింది. ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులతో సమ్మె విరమింపచేయడంలో చొరవ చూపట్లేదేం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో రైల్వేస్ కంటే బస్సుల్లోనే ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తారని, అధిలాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యంతో హైదరాబాద్ రావాలంటే ఎలా అని నిలదీసింది. డెంగ్యూతో ఓ చిన్నారి ప్రాణాలు పోయాయని, ప్రజలు కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని స్పష్టం చేసింది. కేవలం రూ.46 కోట్లు లేవని చెప్పే ప్రభుత్వం చిన్నారి చావుకు బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించింది కోర్టు. ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న కార్మికులు

హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అసలు ప్రభుత్వం వల్లే సమ్మె చేసే పరిస్థితి వచ్చిందని కార్మికుల తరఫు లాయర్ ప్రకాశ్ రెడ్డి వాదించారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయలేదని చెప్పారు. కార్మికులు తమ సమస్యలను చెప్పుకొనేందుకు కనీసం ఎండీని కూడా ప్రభుత్వం నియమించలేదన్నారు.

మొత్తం 26 డిమాండ్లను చర్చించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నామని, విలీనం తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు. దానిపై అంగీకరిస్తారా లేదా అన్నది తర్వాతి సంగతని, కనీసం చర్చించాలని కదా అని అడిగారు ప్రకాశ్ రెడ్డి. కేవలం 21 డిమాండ్లపైనే చర్చిస్తామని యాజమాన్యం చెప్పిందని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా చర్చలు జరగాలని కోరుకుంటున్నామని కోర్టుకు చెప్పారు. మొదటి డిమాండ్ పైనే చర్చ జరగకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన చాలా బకాయిలు రాకనే ఆర్టీసీ నష్టాల్లో ఉందని, ఆర్థిక భారమంటూ ప్రభుత్వం ఈ సమస్యను సాగదీస్తోందని ప్రకాశ్ రెడ్డి అన్నారు. అయితే విలీనం డిమాండ్ పైనే పట్టుబడితే చర్చలు ముందుకు సాగవని, సమస్యపై ప్రతిష్ఠంభన నెలకొంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

చర్చలకు పిలిస్తే.. మధ్యలో వెళ్లిపోయారు

చర్చలకు రావాలని కార్మికులను ఆర్టీసీ యాజమాన్యం పిలిచిందని ప్రభుత్వం తరఫు న్యాయమాది అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు హైకోర్టుకు తెలిపారు. కానీ, యూనియన్ నేతలు విలీనం డిమాండ్ పైనే పట్టుబట్టి మధ్యలోనే వెళ్లిపోయారని చెప్పారు. హైకోర్టులో వాదనలు ప్రారంభం కాగానే చర్చలకు సంబంధించి కౌంటర్ ను దాఖలు చేశారాయన. కార్మికులు అన్ని డిమాండ్ల పై చర్చలకు పట్టుబడుతున్నారని, కానీ ఓవర్ నైట్ లో అన్నీ పరిష్కారం కావని, కొంత టైం ఇవ్వాలని అన్నారు.

21 డిమాండ్స్ లో పదహారింటిపై ప్రభుత్వం పరిశీలిస్తోందని, వాటిలోనూ కేవలం రెండు మాత్రమే ఆమోదయోగ్యంగా ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ దగ్గర కేవలం 10 కోట్లు మాత్రమే ఉన్నాయని, కార్మికులు పెట్టిన డిమాండ్లలో నాలుగింటి పరిష్కారానికే 46 కోట్లు అవసరమని చెప్పారు ప్రభుత్వం తరఫు లాయర్. కార్మికులకు జీతాలు పెంచినా వారు సమ్మె చేస్తున్నారని చెప్పడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు సామరస్యంగా ఉంటే కార్మికులు ఇలా ఎందుకు చేస్తారని, సమ్మెను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించింది. వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్ రావాలని ఆదేశించింది. ఏజీ వచ్చిన తర్వాత ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. సమస్యల పరిష్కారానికి రూ.50 కోట్లు ప్రభుత్వం ఇవ్వకుంటే తామివ్వాలా అని కోర్టు ప్రశ్నించింది.