బీఆర్​ఎస్​ ఎంపీ ఫౌండేషన్​కు భూ కేటాయింపు రద్దు చేసిన హైకోర్టు

బీఆర్​ఎస్​ ఎంపీ ఫౌండేషన్​కు భూ కేటాయింపు రద్దు చేసిన హైకోర్టు
  • బీఆర్​ఎస్​ ఎంపీ పార్థసారథిరెడ్డి ఫౌండేషన్​కు కేటాయింపులపై హైకోర్టు ఫైర్​
  • రాష్ట్ర సర్కార్​ తీరును తప్పుబట్టిన చీఫ్​ జస్టిస్​ ధర్మాసనం.. లీజ్​ను రద్దు చేస్తూ తీర్పు
  • 1989 నాటి విధానాన్ని ప్రామాణికంగా తీసుకునుడేంది? 
  • అప్పట్ల భూముల రేట్లు ఎట్లున్నయ్​.. ఇప్పుడెట్లున్నయ్​?
  • ల్యాండ్​ ఎక్విజిషన్‌‌  అథారిటీ 10 ఎకరాలు చాలంటే.. 15 ఎకరాలు ఎట్లిస్తరు?
  • ఏడాదికి రూ. 50 కోట్లకుపైగా లీజు రావాల్సిన భూమిని లక్షా 47 వేలకే ఎట్ల కట్టబెట్టారు?
  • ప్రభుత్వ తీరుతో రూ. 5,344 కోట్ల నష్టమని ఆగ్రహం


హైదరాబాద్, వెలుగు:  బీఆర్‌‌ఎస్‌‌  రాజ్యసభ సభ్యుడు, హెటిరో అధినేత​ పార్థసారథిరెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌‌కు హైదరాబాద్‌‌ నగర నడిబొడ్డున అత్యంత విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం లీజుకు ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ల్యాండ్​ లీజు కోసం 2018లో జారీ చేసిన జీవో 59ని కొట్టేసింది. అదే సంవత్సరం ఆగస్టులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇచ్చిన మెమోను కూడా డిస్మిస్‌‌ చేసింది. భూముల రక్షణకు ప్రభుత్వం ట్రస్టీగా వ్యవహరించాలని, అయితే.. ఆ బాధ్యతను రాష్ట్ర సర్కారు విస్మరించిందని ధర్మాసనం మండిపడింది. 30 ఏండ్ల నాటి మార్కెట్‌‌ విలువను ఆధారంగా చేసుకొని 15 ఎకరాల భూమిని ఏడాదికి లక్షా 47 వేలకే 60 ఏండ్ల పాటు లీజుకు ఇవ్వడం ఏమిటని నిలదీసింది. మార్కెట్​ విలువ ప్రకారం, ల్యాండ్‌‌ ఎక్విజిషన్‌‌ అథారిటీ లెక్కల ప్రకారం.. ఏడాదికి రూ. 50 కోట్లకుపైగా లీజు రావాల్సిన భూమి అది అని పేర్కొంది. ప్రభుత్వ తీరుతో 60 ఏండ్లలో రూ. 5,344.6 కోట్లు నష్టం వాటిల్లుతుందని తెలిపింది. సాయి సింధు ఫౌండేషన్‌‌కు ఆస్పత్రి నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌‌లో 15 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కార్​ 2018లో కేటాయించింది. 


విలువైన భూమిని అత్యంత తక్కువ ధరకే లీజుకు ఇవ్వడాన్ని సవాల్​ చేస్తూ 2019లో డాక్టర్‌‌ ఉర్మిలా పింగ్లే ఇతరులు పిల్​ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ 125 పేజీలతో సోమవారం కీలక తీర్పును వెలువరించింది. 

మీ జీవోలను మీరే విస్మరిస్తే ఎట్లా?

భూ కేటాయింపులకు సంబంధించి 2012, 2015 సంవత్సరాల్లో ప్రభుత్వం జారీ చేసిన 571, 218 జీవోలకు సర్కారే తిలోదకాలిచ్చిందని హైకోర్టు మండిపడింది.  ‘‘1989లో బసవతారకం ఆస్పత్రికి 7.5 ఎకరాలను ఏడాదికి రూ.50 వేలకు లీజుగా నిర్ణయించారు. ఆ లీజును మూడేండ్లకు ఒకసారి 5% పెంచాలని అప్పుడు ప్రభుత్వ నిర్ణయించింది. ఇప్పటి ప్రభుత్వం 1989నాటి లీజు వ్యవహారాన్ని ప్రామాణికంగా తీసుకుని 2018లో సాయి సింధు ఫౌండేషన్‌‌కు భూకేటాయింపులు జరిపింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. దీని ప్రకారం సాయి సింధు ఫౌండేషన్‌‌కు కేటాయించిన 15 ఎకరాల భూమికి ఏడాది లీజు ధర రూ.1,47,743 మాత్రమే వస్తుంది” అని తప్పుబట్టింది. 571 జీవో గైడ్​లైన్స్​ను రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కాలేదని మండిపడింది. ‘‘రాష్ట్ర సర్కార్‌‌ భూకేటాయింపుల విధానం ప్రకారం మార్కెట్‌‌ విలువలో లీజు 10% ఉండాలి. ఐదేండ్లకోసారి లీజును మార్కెట్‌‌ విలువను బట్టి పది శాతం సవరించాలి. ఈ లెక్కన చూసుకుంటే.. సాయి సింధు ఫౌండేషన్‌‌కు కేటాయించిన భూమికి తొలి ఏడాది నుంచే రూ.50.5 కోట్లు లీజు చెల్లించాల్సి ఉంటుంది. 1989లో బసవతారం ఆస్పత్రికి భూమి కేటాయింపు జరిగినప్పుడు గజం ధర రూ.50 మాత్రమే. ఇప్పుడు గజం భూమి ధర రూ.70 వేల వరకు ఉంది” అని  తీర్పులో హైకోర్టు పేర్కొంది.  ‘‘సాయిసింధు ఫౌండేషన్‌‌కు భూమి కేటాయింపులపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌ పలుసార్లు ప్రతిపాదనలు చేశారు. దీనిపై ల్యాండ్‌‌ ఎక్విజిషన్‌‌ అథారిటీ ఆమోదించిన విధానానికి విరుద్ధంగా కేటాయింపులు జరిగాయి. మార్కెట్‌‌ విలువను గజం రూ. 75 వేలుగా అథారిటీ  నిర్ణయించింది. రాష్ట్ర సర్కార్‌‌ 1989లో బసవతారకం ఆస్పత్రికి 7.5 ఎకరాల కేటాయింపు కోసం ఎంచుకున్న విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని సాయి సింధు ఫౌండేషన్‌‌కు భూములు కేటాయించడం ఏమిటి?”అని ప్రశ్నించింది. 

అదేమైనా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యమా?

సాయి సింధు ఫౌండేషన్​ చేపట్టబోయే ప్రాజెక్టు ఏమైనా ప్రభుత్వ, ప్రైవేట్‌‌ భాగస్వామ్యంతో కూడుకున్నదా అని హైకోర్టు నిలదీసింది. ‘‘ప్రైవేట్‌‌ ఫౌండేషన్‌‌కు అప్పనంగా భూములు అప్పగించడం ఏంటి? 1989 నాటి భూకేటాయింపులను ప్రామాణికంగా ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉంది. 1989లో బసవతారం ఆస్పత్రికి భూమి కేటాయింపు జరిగినప్పుడే ప్రభుత్వ విధానం అంటూ ఏమీ లేదు. అప్పటి లీజును యథాతథంగా ఏడాదికి రూ.50 వేలు, మూడేండ్లకు 5% పెంచేలా నిర్ణయం తీసుకునేముందు గత 34 ఏండ్లలో హైదరాబాద్‌‌లో పెరిగిన భూముల విలువలను ప్రభుత్వం పట్టించుకోలేదు”అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ప్రజావసరాలైన విద్య, వైద్యం వంటి అవసరాలు తీర్చేందుకు భూకేటాయింపులు చేయవచ్చు. ఇందుకు టెండర్‌‌ విధానం అమలు చేయాల్సిన అవసరం లేకపోయినా.. 2012, 2015లో జారీ చేసిన 571, 218 జీవోలకు వ్యతిరేకంగా పార్థసారథికి చెందిన ఫౌండేషన్​కు భూముల కేటాయించారు. ఆస్పత్రి నిర్మాణానికి సాయి సింధు ఫౌండేషన్‌‌కు పదెకరాలు చాలని అథారిటీ సిఫార్సు చేస్తే ప్రభుత్వం 15 ఎకరాలను ఇస్తూ, ఏడాదికి రూ.1.47 లక్షల లీజుకు ఇచ్చింది” అని తీర్పులో తప్పుబట్టింది.  ‘‘సుప్రీంకోర్టు ఆర్డర్స్‌‌ ప్రకారం.. ప్రభుత్వానికి నచ్చిన సంస్థలు లేదా వ్యక్తులకు  భూముల కేటాయించడానికి వీల్లేదు. ప్రభుత్వ భూముల కేటాయింపులు ప్రజాహితంతో ఉండాలి. సాయి సింధు ఫౌండేషన్​కు జరిపిన కేటాయింపుల్లో  అవేమీ కనిపించడం లేదు” అని పేర్కొంది. 
నిర్మాణాలు చేసేశామంటే సరిపోదు

‘‘ఆర్టికల్ 14​కు విరుద్ధంగా ప్రభుత్వం భూ కేటాయింపులు జరపొద్దు. సమన్యాయం, సమానత్వం ఉండేలా చూడాలి. ఇందుకు తగ్గట్టుగా ప్రభుత్వం కసరత్తు చేయాలన్న సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌ను రాష్ట్రాలు అమలు చేయాలి. కానీ, అందుకు విరుద్ధంగా సాయిసింధు ఫౌండేషన్​కు కేటాయింపులు జరిగాయి. ఇదంతా ఏకపక్షంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంది. వాదనల సమయంలో ప్రభుత్వం చెప్పిన పలు తీర్పులు ఏవీ ఈ కేసులో వర్తించడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌‌ నాటికి నిర్మాణాలు పూర్తి అవుతాయని, భూ కేటాయింపుల్లో జోక్యం చేసుకోవద్దని సాయి సింధు ఫౌండేషన్‌‌ చేసిన వాదనను సమర్థించడం లేదు” అని తీర్పులో కోర్టు స్పష్టం చేసింది. ఇదే హైకోర్టు 2021 ఫిబ్రవరి 11న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సదరు భూమిలో ఏ విధమైన నిర్మాణాలు జరిగినా అవి తుది తీర్పుకు లోబడి ఉండాలని చెప్పిందని తన తీర్పులో గుర్తు చేసింది. ‘‘నిర్మాణాలు చేశామని చెప్పి విధానాలకు వ్యతిరేకంగా భూకేటాయింపులు ఉంటే సమర్థించం” అని చెప్పింది. అందుకే ఫౌండేషన్‌‌కు 15 ఎకరాలను కేటాయిస్తూ 2018లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 59ని రద్దు చేస్తున్నామని పేర్కొంది. 

సర్కారు తీరు రాజ్యాంగ వ్యతిరేకం

సాయి సింధు ఫౌండేషన్‌‌కు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌‌లో 15  ఎకరాల భూ కేటాయింపుల తీరు పల్లెంలో పెట్టి అప్పనంగా ఇచ్చినట్లు ఉంది. ప్రభుత్వ జీవోలను  ప్రభుత్వమే తుంగలో తొక్కింది. ఫౌండేషన్​కు 10 ఎకరాల భూమి చాలని ల్యాండ్‌‌ ఎక్విజిషన్‌‌ అథారిటీ చెప్తే.. ప్రభుత్వం ఏకంగా  15 ఎకరాలు లీజుకిచ్చింది.  అదీ నామమాత్రపు రేట్​కే. ఆ సంస్థ చేపట్టే ప్రాజెక్టు ఏమైనా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కూడుకున్నదా? సర్కార్​ తీరు రాజ్యాంగానికి వ్యతిరేకం.
- తీర్పులో హైకోర్టు