హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 3,900 గజాల జాగా కబ్జాపై దాఖలైన పిల్ విచారణను క్లోజ్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. పోలీసులు కేసు పెట్టి, లోయర్ కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేసిన కారణంగా పిల్‌పై విచారణ అవసరం లేదని తేల్చింది. 8 వేల గజాల ఓయూ ల్యాండ్ కబ్జా అయినా ఆఫీసర్లు చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ పి.రమణారావు వేసిన పిల్‌పై విచారణ అవసరం లేదని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 8 వేల గజాలు కబ్జా కాలేదని, 3,900 గజాల జాగా మాత్రమే కబ్జా అయ్యిందని, దీనిపై పోలీసులు ఐదుగురిని నిందితులుగా చేర్చుతూ పెట్టిన కేసులో చార్జిషీట్ దాఖలు చేశారని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు.
తులసి హౌసింగ్ సొసైటీ గతంలోనే అక్కడి ల్యాండ్‌పై మేనేజ్‌మెంట్ రైట్స్‌ను సిటీ సివిల్ కోర్టు ద్వారా పొందిందని, ఈ ల్యాండ్‌ను 14 మందికి సొసైటీ అమ్మిందని, తర్వాత ఒక సర్వేను బేస్ చేసుకుని 3,900 గజాల జాగా కూడా తమదేనంటూ 9 మందికి అమ్మిందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఏసీబీ స్థాయి ఆఫీసర్ దర్యాప్తు చేసి లోయర్ కోర్టులో చార్జిషీటు కూడా వేశారని చెప్పారు. ఈ వివరాలను సమోదు చేసుకున్న హైకోర్టు, లోయర్ కోర్టులో చట్ట ప్రకారం విచారణ చేసి, ఓయూ ల్యాండ్ కబ్జా కేసులో దోషుల్ని తేల్చాలని ఉత్తర్వులు జారీ చేస్తూ, పిల్‌పై విచారణను క్లోజ్ చేసింది.
