చెరువుల ఆక్రమణలపై పిల్

చెరువుల ఆక్రమణలపై పిల్

హైదరాబాద్, వెలుగు:  కబ్జాల కారణంగా చెరువులు, కుంటల విస్తీర్ణం తగ్గిపోతున్నదని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు పిల్‌‌గా పరిగణించింది. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక, నీటిపారుదల, రెవెన్యూ, హోం శాఖ ముఖ్య కార్యదర్శులు, హెచ్‌‌ఎండీఏ చెరువుల రక్షణ కమిటీ, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను చేర్చింది. చెరువులకు సంబంధించిన భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని, ఫలితంగా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నదని హైకోర్టుకు జస్టిస్‌‌ ఈవీ వేణుగోపాల్‌‌ ఇటీవల లేఖ రాశారు.

దీని వల్ల నీటి వనరుల సమస్య జఠిలం అవుతుందని పేర్కొంటూ.. తన లేఖకు పత్రికలో వచ్చిన కథనాన్ని జత చేశారు. పటాన్‌‌ చెరువు, సంగారెడ్డి, నర్సాపూర్‌‌ ప్రాంతాల్లో 30కిపైగా చెరువులు ఆక్రమణలకు గురైనట్టు కథనంలో ఉన్న విషయాన్ని వివరించారు. తన లెటర్ ను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించాలని కోరారు. దీంతో  పత్రికా కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌‌గా పరిగణించింది. ఈ పిల్ ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించనుంది.