నాలుగు వారాల్లో పరిష్కరించండి : హైకోర్టు

నాలుగు వారాల్లో పరిష్కరించండి : హైకోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు : ఉప్పల్‌‌ స్టేడియం డెవలప్‌‌మెంట్‌‌ వర్క్‌‌ విషయంలో హెచ్‌‌సీఏ, విశాక ఇండస్ట్రీస్‌‌ మధ్య తలెత్తిన ఆర్థిక లావాదేవీల వివాదాన్ని నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని హైకోర్టు.. వాణిజ్య కోర్టును ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆలోక్‌‌ అరాదే, జస్టిస్‌‌ ఎన్‌‌.వి. శ్రవణ్‌‌ కుమార్‌‌తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం ఆదేశాలు జారీ చేసింది. స్టేడియం నిర్మాణ వ్యవహారాల్లో విశాక ఇండస్ట్రీస్‌‌కు హెచ్‌‌సీఏ నగదు చెల్లించలేదు. 

దీనిపై న్యాయపోరాటం చేసిన విశాఖ ఇండస్ట్రీస్‌‌ 2016 మార్చి 15న ఆర్బిట్రేషన్‌‌ అవార్డును పొందింది. అయితే దానిని హెచ్‌‌సీఏ ఇప్పటి వరకు అమలు చేయలేదు. వివాదం వాణిజ్య కోర్టుకు చేరినా హెచ్‌‌సీఏ పట్టించుకోలేదు. దీంతో 2021లో ఎగ్జిక్యూషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేయగా గతేడాది అక్టోబర్‌‌ 6న స్టేడియం, ఆస్తుల ఎటాచ్‌‌మెంట్‌‌కు ఆర్డర్‌‌ వచ్చింది. ఈ విషయాన్ని హెచ్‌‌సీఏకు చెప్పినా ఖాతరు చేయలేదు. వాణిజ్య వివాదాల కోర్టులో కౌంటర్‌‌ కూడా చేయలేదు. 

దీంతో హెచ్‌‌సీఏకు వ్యతిరేకంగా ఎక్స్‌‌పార్టీ ఆర్డర్‌‌ జారీ అయ్యింది. తర్వాతి విచారణలను సైతం హెచ్‌‌సీఏ పట్టించుకోకపోవడంతో రూ. 17.5 కోట్లను ఆరు వారాల్లోగా విశాకకు చెల్లించాలని వాణిజ్య కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం అప్పీల్‌‌ విచారణకు వచ్చినప్పుడు హెచ్‌‌సీఏ న్యాయవాది కల్పించుకుని, ఈ వివాదం వాణిజ్య వివాదా కోర్టులో విచారణకు వచ్చిందని చెప్పారు. అయితే, ఈ వ్యవహారాన్ని అదే కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.