వరద బాధితులకు చేసిన సాయమేది:హైకోర్టు

వరద బాధితులకు చేసిన సాయమేది:హైకోర్టు
  • వివరాలివ్వాలని సర్కారుకుహైకోర్టు ఆదేశం
  • ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వాళ్లకు, చనిపోయిన వాళ్ల కుటుంబాలకు ఏ విధమైన సాయం అందజేశారో  పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మళ్లీ  భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తుగా అన్ని సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌ కుమార్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 
జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ డాక్టర్‌‌ చెరుకు సుధాకర్‌‌ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. గవర్నమెంట్‌‌ స్పెషల్‌‌ ప్లీడర్‌‌ హరేందర్‌‌ పరిషద్‌‌ వాదనలు వినిపిస్తూ.. వర్షాలకు రాష్ట్రంలో 49 మంది మరణించారని, 23 ఫ్యామిలీలకు రూ.4 లక్షలు చొప్పున ప్రభుత్వం సాయం చేసిందని కోర్టుకు తెలిపారు. మిగిలిన 26 కుటుంబాలకు వారసుల్ని లీగల్‌‌గా గుర్తించాక సాయం అందజేస్తామని చెప్పారు. 
20,387 మంది వరద బాధితులను గుర్తించి సహాయక చర్యలు ప్రారంభించామన్నారు. ప్రత్యేకంగా కేటాయించిన రూ.500 కోట్లతో పంచాయతీరాజ్, ఆర్‌‌ ఆండ్‌‌ బీ రోడ్లను రిపేర్ చేస్తున్నామని వివరించారు. పూర్తి వివరాల నివేదిక సమర్పణకు గడువు కావాలని కోర్టును కోరారు. పిటిషనర్‌‌ లాయర్‌‌ చిక్కుడు ప్రభాకర్‌‌ కల్పించుకుని మళ్లీ భారీ వర్షాల హెచ్చరికలు వెలువడ్డాయని అన్నారు. దీంతో హైకోర్టు పైవిధంగా ప్రభుత్వానికి ఆదేశాలిస్తూ..విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.