నాలుగేండ్లు ఇక్కడ చదవలేదని మెడిసిన్ సీటు నిరాకరించొద్దు : హైకోర్టు

నాలుగేండ్లు ఇక్కడ చదవలేదని మెడిసిన్ సీటు నిరాకరించొద్దు : హైకోర్టు
  • శాశ్వత నివాసితులకు లోకల్ కోటాలో అడ్మిషన్లు ఇవ్వండి 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన శాశ్వత నివాసితులు, సంబంధిత ఆఫీసర్ల నుంచి నివాస సర్టిఫికెట్‌‌ సమర్పించిన వారికి లోకల్ రిజర్వేషన్ కింద మెడికల్‌‌ సీట్లు కేటాయించాలని కాళోజీ మెడికల్‌‌ యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. మెడికల్‌‌ అడ్మిషన్లకు ముందు 4 ఏండ్లపాటు తెలంగాణలో నివాసం లేరని, రాష్ట్రంలో చదవలేదని చెప్పి స్థానిక రిజర్వేషన్‌‌ కోటాను నిరాకరించడం చెల్లదని తేల్చింది. రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థుల పేరెంట్స్‌‌ వేరే రాష్ట్రాలకు ఉద్యోగాల కారణంగా ట్రాన్సఫర్‌‌ అవ్వడం, ఇతర కారణాల వల్ల ఇంటర్మీడియట్‌‌ మరో స్టేట్‌‌లో చదవడం, ఇతర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేయడం వల్ల, మధ్యలో కొన్నేండ్లు మరోచోట చదివి తిరిగి ఇంటర్‌‌ ఇక్కడ చదువుకున్నవారికి 85 శాతం స్థానిక రిజర్వేషన్‌‌ కోటా కింద కాళోజీ వర్సిటీ అడ్మిషన్లను నిరాకరించింది. 

మెడికల్‌‌ అడ్మిషన్ల నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం 2017లో వెలువరించిన జీవో 114ను సవాల్‌‌ చేసిన రిట్‌‌ పిటిషన్లపై చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం 85 పేజీల కీలక తీర్పు చెప్పింది. మెడికల్‌‌ అడ్మిషన్లలో స్థానిక రిజర్వేషన్లకు చెందిన రూల్‌‌ ఆర్‌‌ 3(111)బి, రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి హైకోర్టు తీర్పులో సమీక్ష చేసింది. ఆర్టికల్‌‌ 371–డిని సుప్రీంకోర్టు సమర్థించినప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వుల చెల్లుబాటు గురించి చర్చించలేదని గుర్తు చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల చెల్లుబాటు గురించి పరిశీలన చేసే పరిధి తమకు ఉందని స్పష్టం చేసింది. ‘మెడికల్‌‌ అడ్మిషన్ల 2017 నిబంధనల ప్రకారం స్థానికంగా నాలుగేండ్లు చదివి ఉండాలి. 

లేదంటే స్థానికంగా నివాసం ఉండాలి. అయితే ఇక్కడ పిటిషనర్లు స్థానికంగా 4ఏండ్లు నివాసం లేదా స్థానికంగా నాలుగేండ్లు చదవలేదు. కాబట్టి మెడికల్‌‌ అడ్మిషన్లు ఇవ్వమని వర్సిటీ చెప్పడం సరికాదు. ఆ నిబంధన పరిధిలోకి పిటిషనర్లు రారు. రూల్‌‌  2(2) ప్రకారం స్థానికతను చట్టం లేదా ప్రభుత్వం నిర్వచించాల్సి ఉంది. ఇక్కడ స్థానిక అభ్యర్థి అన్నది చట్టంలోగానీ, ప్రభుత్వంగానీ ఎక్కడా నిర్వచనం చేయలేదు. మెడికల్‌‌ అడ్మిషన్ల రూల్‌‌ సమర్ధనీయంగా లేదు. ఈ రూల్‌‌ ద్వారా మెడికల్‌‌ సీట్లు తెలంగాణ వారికే కేటాయించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చలేరు. పేరెంట్స్‌‌ ట్రాన్సఫర్‌‌ వల్ల మెడికల్‌‌ అడ్మిషన్లకు ముందు నాలుగేండ్లు వేరే స్టేట్‌‌లో చదివిన స్టూడెంట్స్​కు స్థానికత వర్తించదంటే చెల్లదు. 

రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసితులు తమ చేతుల్లో లేని వ్యవహారం కారణంగా వేరే చోట్ల చదువుకున్నారని గుర్తుంచుకోవాలి. శాశ్వత నివాసితులకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నవారికి విద్యా సంస్థల్లో సీట్లు కల్పించడానికి తెచ్చిన ప్రత్యేక నిబంధన ఆర్‌‌ 3710(2)(బి) (జీజీ) ప్రకారం ఉంటుంది. పిటిషనర్లు వారంలోగా తాము శాశ్వత నివాసితులమని పేర్కొంటూ సంబంధిత ఆఫీసర్ల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని వర్సిటీకి సమర్పించాలి. వారిని లోకల్ ​కోటా కింద కాళోజీ వర్సిటీ పరిగణించి మెడికల్‌‌ అడ్మిషన్లు కల్పించాలి..’’ అని తీర్పు చెప్పింది.