- రైల్వే శాఖకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని రైల్వే గూడ్స్‌షెడ్ తరలింపుపై 2009, 2016లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ఆపరేషనల్ సీనియర్ మేనేజర్ చేసిన సిఫారసులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రైల్వే శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిఫారసులను పరిశీలించి నిర్ణయం తీసుకునే ముందు రైల్వేశాఖ విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. సనత్‌నగర్‌లోని గూడ్స్‌షెడ్‌ను ప్రత్యామ్నాయ స్టేషన్‌కు తరలించేలా ఆదేశాలివ్వాలంటూ సనత్‌నగర్‌కు చెందిన డి.ఉదయ్‌కుమార్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీధర్ వాదనలు వినిపిస్తూ.. రైల్వే నిర్వహించే గూడ్స్‌షెడ్, వేర్‌హౌసింగ్ కార్యక్రమాల వల్ల రద్దీ పెరిగిందన్నారు. నిరంతరం భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రజలు ప్రాణాలకు ప్రమాదంగా మారిందన్నారు. పరిధికి మించి ఉన్న గూడ్స్‌షెడ్‌లకు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా 2009లో, 2016లో సనత్‌నగర్ కార్యకలాపాలను మౌలాలి, చర్లపల్లి, నాగలపల్లి, శంకరపల్లి స్టేషన్‌లకు తరలించాలని సీనియర్ డివిజనల్ మేనేజర్ సిఫారసు చేశారన్నారు.
ప్రత్యామ్నాయ గూడ్స్‌షెడ్‌ల సేవలను వినియోగించుకునే పరిశ్రమలు, వ్యాపారాలకు ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు రైల్వే కూడా పేర్కొందన్నారు. రైల్వే తరఫు న్యాయవాది వాదలను వినిపిస్తూ.. ఆహార ధాన్యాలు, ఎరువులు, స్టీల్, సిమెంట్, ఉప్పు తదితరాలన్నీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రవాణా అవుతుంటాయన్నారు. రోజుకు 500 లారీలు వస్తుంటాయని,1,500 మంది కూలీలు పని చేస్తుంటారన్నారు. అంతేగాకుండా దీనిపై ఆధారపడి జీడిమెట్ల, బాలానగర్, చందానగర్, ఫతేనగర్ వంటి పారిశ్రామికవాడలు ఉన్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత.. రైల్వే డివిజనల్ మేనేజర్ సిఫారసులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని జడ్జి ఆదేశించారు.