
హైదరాబాద్, వెలుగు: నకిలీ పురుగుమందుల అమ్మకాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలను వివరించాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. వాటి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపింది. నకిలీ పురుగు మందులతో పండిన పంటలను తిని జనం రోగాలబారిన పడుతున్నారంటూ సంగారెడ్డి జిల్లా బీరంగూడకు చెందిన లాయర్ వి.రవికృష్ణ పిల్ దాఖలు చేశారు.
దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. నకిలీ మందుల అమ్మకాల తనిఖీలకు టాస్క్‌పోర్సు కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. కోర్టు స్పందిస్తూ.. కౌంటర్ వేయాలని కేంద్ర వ్యవసాయశాఖ, పర్యావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి, వ్యవసాయశాఖ కమిషనర్లను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. నకిలీ మందుల తయారీ సంస్థలను గుర్తించి అధికారిక గెజిట్‌లో ప్రచురిస్తే వాస్తవాలు బహిర్గతం అవుతాయని తెలిపింది.
మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమలును వివరించండి
మానసిక ఆరోగ్య పరిరక్షణ చట్టం ప్రకారం.. రాష్ట్ర స్థాయిలో మండలి, జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసిందీ.. లేనిదీ తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లాయర్ ఆర్.భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా తీసుకుంది.
దీన్ని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. కేంద్రంతోపాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, వైద్యవిధాన పరిషత్, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్, ఎరగ్రడ్డ ఆస్పత్రి సూపరింటెండెంట్ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు ఇచ్చింది.