చెట్లను తొలగిస్తే తిరిగి నాటండి : హైకోర్టు

చెట్లను తొలగిస్తే తిరిగి నాటండి :  హైకోర్టు
  • దామగుండంలో రాడార్‌‌ సెంటర్‌‌  ఏర్పాటుపై  కేంద్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్‌‌  జిల్లా దామగుండంలో ఏర్పాటు చేస్తున్న ఎక్స్‌‌ట్రీమ్లీ లోఫ్రీక్వెన్సీ రాడార్‌‌  ప్రాజెక్ట్‌‌  ఏర్పాటుపై ఎప్పటికప్పుడు నివేదికలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చుట్టుపక్కల జీవవైవిధ్యంపై ఏవిధమైన ప్రభావం ఉందో చెప్పాలని పేర్కొంది. రాడార్‌‌  కేంద్రం ఏర్పాటు కోసం కొట్టేసిన చెట్లను తిరిగి నాటాలని, చెట్లను ఎక్కడ నాటుతారో చెప్పాలని సూచించింది. 

రాడార్‌‌  ప్రాజెక్టు  కేంద్రానికి 2,900 ఎకరాల దామగుండం అటవీ భూములను బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దామగుండం ఫారెస్ట్‌‌  ప్రొటెక్షన్‌‌  జేఏసీ వేసిన పిల్‌‌ను చీఫ్‌‌  జస్టిస్‌‌  అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌  మొహియుద్దీన్‌‌ తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ సోమవారం మరోసారి విచారించింది. 

ప్రాజెక్ట్‌‌  కోసం 2,900 ఎకరాలకుపైగా భూమిని కేటాయించినప్పటికీ, ఈ ప్రాంతంలోని భారీ వృక్షాలు, జంతువులు, పక్షులకు నష్టం చేకూతుందని పిటిషనర్‌‌  వాదించారు. చెట్ల నరికివేత తక్కువగా ఉండాలని అమికస్‌‌  క్యూరీ వివేక్‌‌ జైన్‌‌  కోర్టుకు తెలియజేశారు. క్షీణించిన అటవీ భూమి కన్నా రెట్టింపు స్థాయిలో చెట్లను నాటాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు.

 కేంద్ర ప్రభుత్వ సంస్థకు పరిహార అటవీకరణ చట్టబద్ధంగా తప్పనిసరి కానప్పటికీ, భారత నావికాదళం క్షీణించిన అటవీ ప్రాంతానికి రెట్టింపు అటవీకరణ చేసేందుకు పూర్తి ఖర్చును భరించడానికి అంగీకరించిందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనికి పరిహార కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని  తెలిపారు. వృక్షజాలం, జంతుజాలానికి ఎటువంటి నష్టం జరగదని, అనివార్యమైతేనే చెట్ల నరికివేత చేపడతామని హామీ ఇచ్చారు. 

సంబంధిత గ్రామ సర్పంచ్‌‌  ఎక్స్‌‌ అఫీషియో చైర్మన్‌‌గా పనిచేసే జీవవైవిధ్య నిర్వహణ కమిటీ.. సదరు సర్పంచ్‌‌  పదవి నుంచి వైదొలగడంతో మూడేళ్లుగా పనిచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం సర్పంచ్  ఎన్నికలు జరుగుతున్నాయని.. వెంటనే కమిటీ తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.