సంబంధం లేనోళ్లను కేసులో ఇరికిచ్చుడేంది: హైకోర్టు

సంబంధం లేనోళ్లను కేసులో ఇరికిచ్చుడేంది: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని కేసు నుంచి తప్పించి, ఏ సంబంధం లేని నలుగురిని కేసులో ఇరికించారని పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ చర్యల కారణంగా అనవసరంగా కేసులను ఎదుర్కొన్న ఆ నలుగురికి రూ.25 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆ మొత్తాన్ని తప్పుడు కేసు పెట్టిన పోలీస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ నుంచి వసూలు చేయాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌‌‌‌ ఎం.లక్ష్మణ్‌‌‌‌ బుధవారం జడ్జిమెంట్‌‌‌‌ చెప్పారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌‌‌‌ మండలంలోని సర్వే నెం 14/బి లోని 1300 గజాల తన జాగనుఅనుచరులతో కలిసి కొలన్ హన్మంతరెడ్డి అనే వ్యక్తి కబ్జా చేసి కంపౌండ్ వాల్ కడుతున్నాడని, ఆపాలంటూ బాధితుడు మహేశ్ కుమార్​రెడ్డి కూకట్​పల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. అసలు నిందితుడైన కొలన్ హన్మంతరెడ్డి పేరును తొలగించి, ఎటువంటి సంబంధం లేని బి.రమేశ్, జె.వెంకటసుబ్బారావు, టి.లక్ష్మయ్య, కె.రాము అనే నలుగురి పేర్లను ఎఫ్​ఐఆర్ లో చేర్చారు. తమను అన్యాయంగా ఇరికించారంటూ ఈ నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించిన కోర్టు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఏపీ అభ్యర్థులను పరీక్షలకు అనుమతించండి

రాష్ట్రంలోని జిల్లా జడ్జీల పోస్టుల భర్తీకి 22, 23 తేదీల్లో నిర్వహించే రాత పరీక్షలకు ఏపీకి చెందిన నలుగురు దరఖాస్తుదారులను అనుమతించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా జడ్జీల పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్‌‌‌‌ 12న నోటిఫికేషన్‌‌‌‌ జారీ అయ్యింది. దరఖాస్తు చేసుకుంటే అకారణంగా తిరస్కరించారంటూ ఏపీకి చెందిన పల్లి హేమలత మరో ముగ్గురు కోర్టులో రిట్‌‌‌‌ పిటిషన్‌‌‌‌  దాఖలు చేశారు. దాన్ని జస్టిస్‌‌‌‌ పి. నవీన్‌‌‌‌రావు, జస్టిస్‌‌‌‌ నగేశ్ భీమపాక డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు రిజిస్ట్రార్‌‌‌‌ (నియామక)కు ఆదేశాలిచ్చి విచారణను వాయిదా వేసింది.

కొత్త పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ ఫీజుల పెంపుపై స్టే

కొత్త పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ల లైసెన్స్‌‌‌‌, పాత వాటి రెన్యు వల్‌‌‌‌ ఫీజుల పెంపునకు సర్కార్‌‌‌‌ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర స్టే ఆదేశాలిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చే దాకా అధిక ఫీజు వసూలు చేయకూడదని చెప్పింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌‌‌‌ చేస్తూ తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌‌‌‌ అసోసి యేషన్‌‌‌‌ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై యాక్టింగ్‌‌‌‌ చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ నవీన్‌‌‌‌రావు, జస్టిస్‌‌‌‌ నగేశ్ భీమపాక ధర్మాసనం శుక్రవారం విచారించి మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది.