హైదరాబాద్, వెలుగు : యూకో బ్యాంక్ జారీ చేసిన లుకౌట్ నోటీసుపై స్టే విధించాలని పిటిషనర్లు వేసిన అప్పీల్ ను సవాల్ చేస్తూ ఆ బ్యాంకు వేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఆ అప్పీల్‌ను డిస్మిస్ చేయడమే కాకుండా యూకో బ్యాంక్‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మే రకు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ భాస్కర్ రెడ్డిల డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పింది.
విజయవాడలోని స్థలాన్ని తాకట్టు పెట్టి ముగ్గురితో కలిసి రూ.75 లక్షల రుణం తీసుకుని చెల్లించలేదని మాగంటి వెంకట రమణారావు, ఆయన భార్య ఉషారాణిపై యూకో బ్యాంక్ లుకౌట్ నోటీసు జారీ చేసింది. దీనిపై వారు హైకోర్టులో సవాల్ చేశారు. వాళ్లపై క్రిమినల్ కేసులు లేనందున లుకౌట్ నోటీసు అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ను బ్యాంకు సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్ వేసింది.
