- ఐదుగురు రైతులకు హైకోర్టు జరిమానా
- రెండు వారాల్లోగా చెల్లించాలన్న న్యాయస్థానం
- ‘పిల్’ను దుర్వినియోగం చేసినందుకు ఫైన్
అమరావతి : కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు రైతులకు హైకోర్టు భారీ జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో చెల్లించాలని, ఒకవేళ చెల్లించకపోతే రెండు నెలల్లో ఆ డబ్బును రెవెన్యూ రికవరీ చట్ట నిబంధనల మేరకు రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..
కర్నూలు జిల్లా అవుకు మండలం సంగపట్నం గ్రామ పరిధిలో ప్రమీల అనే ఓ మహిళ మైనింగ్ లీజు పొందారు. ఆమె మైనింగ్ కోసం ఇచ్చిన నిరభ్యంతర పత్రాన్ని అక్కడి MRO ఉపసంహరించుకున్నారు. దీంతో మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో.. ప్రమీల హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమె కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసినా దానిని ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టి కొలిమిగుండ్ల మండలం బెలుంశింగవరం గ్రామానికి చెందిన ఎం.రమణారెడ్డితో పాటు మరో ఐదుగురు రైతులు అదే ఏడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ పిల్‌ను విచారించిన హైకోర్టు… మైనింగ్ లీజుపై స్టే విధించింది. అనంతరకాలంలో ఆ పిల్‌పై జరిగిన విచారణకు న్యాయవాది గైర్హాజరయ్యారు.అప్పటి నుంచి వాద, ప్రతివాదుల మధ్య కేసు నడుస్తూనే ఉంది. తాజాగా సీజే ముందుకు కేసు రాగా.. ఆ రైతులు తనను ఈ కేసు వాదించవద్దన్నారని, బెదిరిస్తూ ఓ లెటర్ కూడా రాశారని వారి తరఫు లాయరే కోర్టుకు తెలిపాడు.
లాయర్ నే బెదిరిస్తారా?
ఆ లేఖను పరిశీలించిన ధర్మాసనం, రమణారెడ్డి తదితరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు వినిపిస్తే బార్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని న్యాయవాదినే బెదిరిస్తారా? అంటూ మండిపడింది. న్యాయవాదిని బెదిరిస్తూ లేఖ రాయడం, కోర్టు ముందు వాస్తవాలు దాచిపెట్టిడం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయడమేనని తేల్చి చెప్పింది. ఆరుగురు పిటిషనర్లలో ఒకరు చనిపోవడంతో మిగిలిన ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తాము చిన్న రైతులమని, అంత జరిమానా చెల్లించలేమని ఆ రైతులు వేడుకున్నా హైకోర్టు అంగీకరించలేదు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

