కరోనాపై సర్కార్ రిపోర్ట్ ను తప్పుబట్టిన హైకోర్ట్

కరోనాపై సర్కార్ రిపోర్ట్ ను తప్పుబట్టిన హైకోర్ట్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నివారణపై ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ లో క్లారిటీ లేదని తెలిపింది హైకోర్ట్. శుక్రవారం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఇచ్చిన నివేదిక నిర్లక్ష్యంగా,  అస్పష్టంగా ఉందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లాల్లో కరోనా వైద్య  సదుపాయాలు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ప్రభుత్వం కరోనా మృతులపై  వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోందన్న  హైకోర్టు..కేసులు పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం 9 లేదా 10 ఉండటం అనుమానంగా ఉందని తెలిపింది. కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. జిల్లా స్థాయి బులిటిన్ల విడుదలపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారని..ఆగస్టు 31 నుంచి ఈనెల 4 వరకు జిల్లా బులిటిన్లు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

జిహెచ్ఎంసిలోని ఐసోలేషన్, కోవిడ్  కేంద్రాల వివరాలు సమర్పించాలని కమిషనర్ కు కూడా ఆదేశాలిచ్చింది హైకోర్టు. జిల్లాల నుంచి కోవిడ్ బాధితులు హైదరాబాద్ కు వచ్చేలా  అంబులెన్సులను పెంచాలని..  పరీక్షలు చేసే ప్రభుత్వ ల్యాబ్స్ పెంచాలని తెలిపింది.  కరోనాకు ముందు, తర్వాత వైద్యారోగ్య రంగానికి కేటాయించినబడ్జెట్ వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఆస్పత్రుల్లో లైవ్ డాష్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మరోసారి తెలిపిన హైకోర్టు.. వీధుల్లో నివసించే వారికి మొబైల్ వ్యాన్ల ద్వారా కరోనా పరీక్షలు చేయాలని చెప్పింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రులు చట్టానికి అతీతమా? లేక ప్రత్యేక రక్షణలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. రాయితీలు తీసుకున్న ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రజలకు సేవ చేసే బాధ్యత లేదా? అని ప్రశ్నించింది హైకోర్టు.

ప్రైవేట్ ఆస్పత్రులపై విచారణ జరపాలని జాతీయ ఫార్మా ధరల సంస్థకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈనెల 22లోగా విచారణ నివేదిక సమర్పించాలని ఎన్ పీపీ ఏకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీహెచ్ డైరెక్టర్ కు సూచించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలు రిజర్వ్ చేస్తామన్న మంత్రి హామీ ఎందుకు అమలు కాలేదని..ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలు రిజర్వు చేస్తారా లేదా తెలపాలన్న హైకోర్టు..ఒకవేళ రిజర్వ్ చేయవద్దని నిర్ణయిస్తే కారణాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.  ఈనెల 22 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చిన హైకోర్టు.. విచారణ 24కు వాయిదా వేసింది.