వీఐపీల ఏరియాల్లోనే రోడ్లు మంచిగ వేస్తరా?

వీఐపీల ఏరియాల్లోనే రోడ్లు మంచిగ వేస్తరా?
  • హైదరాబాద్ రోడ్లన్నీ గతుకులే
  • జీహెచ్ఎంసీపై మండిపడిన హైకోర్టు 
  • వాటిపై ప్రయాణం చేస్తే నడుం నొప్పి వచ్చేట్టు ఉంది
  • వీఐపీల ఏరియాల్లోనే రోడ్లు మంచిగ వేస్తరా? 
  • సౌలతులు కల్పిస్తారనే కదా.. జనం పన్నులు కడుతున్నరు 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో రోడ్ల దుస్థితిపై హైకోర్టు మరోసారి మండిపడింది. ‘ఏ రోడ్డు చూసినా గతుకులమయంగా తయారైంది. వాటిపై ప్రయాణం చేస్తే నడుం నొప్పి వచ్చేట్టు ఉంది’ అని కామెంట్ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి వీఐపీలు ఉండే ప్రాంతాల్లోనే సౌలతులు కల్పిస్తరా? అని జీహెచ్ఎంసీని ప్రశ్నించింది. ప్రముఖుల కాలనీల్లోనే తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు తదితర సౌలతులు కల్పిస్తే సరిపోతుందా? అని నిలదీసింది. సాధారణ ప్రజల కోసం ఏం చేస్తున్నారో చెప్పాలంది. జనం, వారి సమస్యలే జీహెచ్ఎంసీ ప్రాధాన్యం కావాలని సూచించింది. రోడ్లు, ఫుట్ పాత్ ల లాంటి సౌలతులు కల్పిస్తారనే కదా.. జనం పన్నులు కడుతున్నారని అడిగింది. రోడ్లపై గుంతల కారణంగా జరిగే ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, వాహనాలు దెబ్బతింటున్నాయని.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. గంగాధర్ తిలక్ దంపతులు తమకు వచ్చే పెన్షన్ తో రోడ్లపై గుంతలను పూడ్చుతున్నారని పేపర్ లో వచ్చిన వార్తను హైకోర్టు సుమోటో స్వీకరించగా .. చీఫ్ జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. 

ఇట్లయితే హైదరాబాద్ ఇమేజ్ ఉంటదా? 
హైదరాబాద్ ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందిందని, ఇక్కడి రోడ్లను చూస్తే జాలేస్తోందని హైకోర్టు కామెంట్ చేసింది. రోడ్లన్నీ గతుకులమయంగా మారితే, సిటీకి ఉన్న ఇమేజ్ ఉంటుందా? అని ప్రశ్నించింది. ఇంత పెద్ద సిటీలో సౌలతులు మంచిగ లేకుంటే, ఆశించిన స్థాయిలో పెట్టుబడులు వస్తాయా? అని అడిగింది. హైదరాబాద్ కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదని.. ఐటీ, ఇండస్ట్రీస్ కు కూడా రాజధాని అనే విషయాన్ని సర్కార్ గుర్తించుకోవాలంది. హైదరాబాద్‌ను అందంగా తీర్చిదిద్దితేనే, దానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుకు అర్థం ఉంటుందని పేర్కొంది.