పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు ఫైర్

పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు ఫైర్

హైదరాబాద్, వెలుగు: పొగాకు ఉత్పత్తుల నిషేధ నోటిఫికేషన్‌‌‌‌ అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన తర్వాత కూడా పోలీసులు వ్యాపారులపై కేసులు పెడుతూ, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలంటే లెక్కలేనట్లుందని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులతోపాటు ఈ నెల 8న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం సర్క్యులర్‌‌‌‌ జారీ చేసి బుధవారం జరిగే విచారణ సందర్భంగా అందజేయాలని పోలీసులను ఆదేశించింది. సర్క్యులర్‌‌‌‌ సమర్పించకపోతే 21న బుధవారం డీజీపీ స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

బిల్లులు చెల్లించి కొనుగోలు చేసిన పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయడం లేదంటూ నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్, నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లాలకు చెందిన వ్యాపారులు దాఖలు చేసిన రిట్లను మంగళవారం జస్టిస్‌‌‌‌ కె.లలిత విచారించారు. పోలీసులను చైతన్యపరుస్తామని గతంలో చెప్పినట్లే ఇప్పుడు కూడా గవర్నమెంట్‌‌‌‌ ప్లీడర్‌‌‌‌ చెప్పడంపై హైకోర్టు మండిపడింది. ఎప్పుడూ అదే మాట చెప్పడం ఏమిటని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులంటే లెక్క లేకపోతే ఎలాగని నిలదీసింది. కోర్టు ఉత్తర్వులపై సర్క్యులర్‌‌‌‌ జారీ చేయాలని, లేకపోతే బుధవారం జరిగే విచారణకు డీజీపీ రావాలని ఆదేశించింది.