
- సున్నం చెరువు కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర స్టే
- విచారణ ఈ నెల 17కు వాయిదా
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని సున్నం చెరువు వద్ద కూల్చివేతలను నిలిపివేయాలంటూ హైడ్రాకు హైకోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలకు పాల్పడటాన్ని తప్పుపట్టింది.
సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ చేయకుండా, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సర్వే నిర్వహించకుండా అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతోందంటూ ఎస్‌ఐఈటీ మారుతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సహా ఏడుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి గురువారం విచారించారు. పిటిషనర్ న్యాయవాది ఎంవీ దుర్గాప్రసాద్ వాదిస్తూ, నోటీసులు ఇవ్వకుండా హైడ్రా జోక్యం చేసుకుంటోందన్నారు. కూల్చివేతలకు పాల్పడటం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరారు.
హైడ్రా న్యాయవాది కౌటూరి పవన్ కుమార్ వాదిస్తూ, శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట సర్వే నంబర్ 12, 13, అల్లపూర్ సర్వే నంబర్ 31లో పిటిషనర్లతోపాటు దాని ప్రభావం ఉన్న అందరికీ నోటీసులు ఇచ్చి సర్వే చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇచ్చిందని, అయితే ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని పిటిషనర్లు ఈ సర్వే నంబర్లలోని బోర్ల నుంచి కలుషిత నీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారని చెప్పారు. వర్షాకాలం వస్తున్నందున చెరువులను పునరుద్ధరించాలని, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ‘‘ఎఫ్‌టీఎల్ అక్రమ నిర్మాణాలను కూల్చడానికి ఓ విధానం ఉంది. చెరువు హద్దులు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించాలి. విలేజ్ మ్యాప్ ఆధారంగా చెరువు హద్దులను నిర్ణయించాలి. ఆ తర్వాత చర్యలు తీసుకునే ముందు దాని ప్రభావిత ప్రజలకు నోటీసులు ఇవ్వాలి. వారి దగ్గరున్న ఆధారాలు, డాక్యుమెంట్లు పరిశీలించాలి. ఇవి నిర్ధారించకుండా హైడ్రా ఏకపక్షంగా కూల్చివేత చర్యలు చేపట్టడానికి వీల్లేదు. నీళ్లు వస్తున్నాయని కూల్చివేతలకు పాల్పడటానికి వీల్లేదు.
ఇలా చేస్తే సగం హైదరాబాద్ ఉండదు, నేలమట్టం అవుతుంది. ఏది అక్రమమో, ఏది సక్రమమో హైడ్రా నిర్ణయించేందుకు వీల్లేదు. చట్ట ప్రకారం చేసి తీరాలి’’ అని చెప్పింది. యథాతథ స్థితి కొనసాగించాలన్న గత ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. బోర్ల నుంచి పిటిషనర్లు నీటిని తరలిస్తే ఆ వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించింది.
గుట్టల బేగంపేటలోని సర్వే నంబర్ 12, 13, అల్లపూర్ సర్వే నంబర్ 31కి సంబంధించి పిటిషనర్లు సమర్పించిన పత్రాలను హైడ్రా పరిశీలించాలని ఆదేశించింది. వివాదం లేదని తేలితే చెరువు పునరుద్ధరణ పనులకు అనుమతి కోసం హైడ్రా హైకోర్టుకు రావాలని తెలిపింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.