
- ఏజీని ప్రశ్నించిన హైకోర్టు
- సర్కారు వాదనలు తెలియజేయాలని ఆదేశం
- విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్, కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ వాదనలు తెలియజేయాలని స్పష్టం చేసింది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ వెనుక లోకల్ పొలిటీషియన్ల భూముల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ జరిగేలా చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లికి చెందిన టి.శ్రీనివాస్ సింగ్, మరో 39 మంది హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు జడ్జి జస్టిస్ పి.మాధవీదేవి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది సృజన్‌కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. రైతులకు తెలియకుండానే కామారెడ్డి మున్సిపాలిటీ.. వారి భూముల్ని మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తెచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కామారెడ్డి ముసాయిదా మాస్టర్ ప్లాన్‌లో భాగంగా తమకు చెందిన 250 ఎకరాల సాగు భూముల్ని రిక్రియేషన్ జోన్ (పార్కులు, ఆట గ్రౌండ్, బహిరంగ ప్రదేశాలు) గా చూపారని చెప్పారు. సర్వే నంబర్ 82లో 7002 ఎకరాలు, సర్వే నంబర్ 208లో 8839 ఎకరాలు, సర్వే నంబర్ 253లో 7115 ఎకరాలు ఉన్నా.. వాటిని మాస్టర్ ప్లాన్ ముసాయిలో లేకుండా చేశార న్నారు. ఇవన్నీ స్థానిక రాజకీయ నేతలకు చెందినవని చెప్పారు. దీంతో ప్రభుత్వ వాదనలు తెలియజేయాలని ఏజీని ఆదేశించిన జడ్జి.. విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేశారు.
నేనూ పిటిషన్ వేస్త: కేఏ పాల్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను కొట్టేయాలని రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోక్యం చేసుకున్నారు. రైతులను పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. తాను పిటిషన్ దాఖలు చేస్తానని చెప్పారు.
కౌన్సిలర్లకు వినతిపత్రాలు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు.. సోమవారం 49 మంది మున్సిపల్ కౌన్సిలర్ల ఇండ్లకు వెళ్లి వినతి పత్రాలు అందజేశారు. ప్లాన్‌ను రద్దు చేయాలని కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ లీడర్లు కోరారు. ఈనెల 11న మున్సిపల్ ఆఫీసు ఎదుట శాంతియుతంగా ధర్నా చేపట్టనున్నట్లు రైతు ఐక్య కార్యచరణ కమిటీ ప్రతినిధులు తెలిపారు.
-