- గోవధపై ఏం చర్యలు తీసుకున్నారో రిపోర్ట్ ఇవ్వండి
హైదరాబాద్, వెలుగు : జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టం అమలు చేస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పండుగ వస్తే హడావుడి చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటే ఎలాగని ప్రశ్నించింది. చట్ట ప్రకారం తీసుకున్న చర్యలపై మళ్లీ నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీకి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ సందర్భంగా గోవులను, పశువులను ఆక్రమంగా తరలిస్తున్నారని పేర్కొంటూ అందిన లేఖను హైకోర్టు సుమోటో పిల్‌గా తీసుకుని విచారణ చేస్తున్నది. దీనిపై సోమవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
ఈ కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 2021కి సంబంధించి అఫిడవిట్ లో 750 గోవులను గోశాలకు సంరక్షణ నిమిత్తం తరలించినట్లు పేర్కొన్నారని, దీనిని బట్టి చూస్తుంటే పండుగల సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత చట్టం అమలు గురించి పట్టించుకోరా అని అధికారులను బెంచ్ ప్రశ్నించింది. 2021 తరువాత జంతు సంరక్షణ, క్రూర చర్యల నిరోధక చట్టం కింద తీసుకున్న చర్యలతో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలంది. విచారణను వాయిదా వేసింది.