ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సమ్మె లీగలా? ఇల్లీగలా? అని తేల్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. రెండు వారాల్లో దీన్నిపై స్పష్టమైన నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేయాలని హైకోర్టు సూచించింది. సమ్మె ఇల్లీగల్ అని ప్రకటించాలని మరోసారి ప్రభుత్వ తరఫు లాయర్ కోరగా, ఇది తమ పరిధిలో లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇది చట్టబద్ధమా, వ్యతిరేకమా అని తాము ప్రకటించలేమని తెలిపింది. లేబర్ కోర్టుకు రెఫర్ చేస్తామని చెప్పింది. ఈ సందర్భంగా గతంలో కార్మిక శాఖ కమిషనర్ ఈ సమ్మె ఇల్లీగల్ అంటూ ఇచ్చిన ఆర్డర్‌ను హైకోర్టు కొట్టేసింది. అది చెల్లదని తేల్చింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన వాదనల్ని డ్రాఫ్ట్ చేసి, ఈ విషయంలో సరైన చర్చలు జరిపి వివరమైన నివేదికతో రెండు వారాల్లో క్లారిటీ ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించింది.
చర్చలకూ మేం ఆదేశించలేం
45 రోజులుగా సమ్మె సాగుతోందని, తాము ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను పక్కనపెట్టామని కార్మికుల తరఫు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి చెప్పారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం చర్చలు జరిపేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే చర్చలకు తాము ఆదేశాలివ్వలేమని ధర్మాసనం చెప్పింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా చర్చలు జరగాలని తెలిపింది.
ప్రమాదాలు పెరిగాయి
తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడపడం వల్ల ప్రమాదాల సంఖ్య పెరిగాయని కార్మిక సంఘాల తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ సేవింగ్స్ 1900కోట్లు వాడుకుందని, పీఎఫ్ డబ్బులు 900 కోట్లు వినియోగించుకుందని తెలిపారాయన. ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే ప్రజలకి ఇబ్బంది జరుగుతుంటే పట్టించుకోకుండా ఉంటే ఎలా అని అడిగారు. ప్రభుత్వ తీరు వల్లే అటు కార్మికులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 45 రోజులుగా కార్మికులు ఓ పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని కోర్టుకు చెప్పారు. ఇన్నాళ్లుగా కోర్టు విచారణ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం కార్మికులపై బెదిరించే ధోరణి అవలంభిస్తోందని చెప్పారు ప్రకాశ్ రెడ్డి.
