
రైతులు తీసుకోవడం లేదన్న ప్రభుత్వ వివరణపై హైకోర్టు
మల్లన్నసాగర్ ముంపు రైతులకు సంబంధించిన చెక్కులను తమ వద్దకు తీసుకురావాలని, వాటిని రైతులకు అందజేసే ప్రయత్నం చేస్తామని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు భూసేకరణ పిటిషన్లపై విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్టేందుకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో చేసిన భూసేకరణకు సంబంధించి రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన బెంచ్విచారించింది.
భూసేకరణ నోటిఫికేషన్‌ను తప్పుపడుతూ రెండేళ్ల కిందటే రైతులు అభ్యంతరం చెప్పారని, అయినా జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ అవార్డు ఇచ్చేయడం చెల్లదని పిటిషనర్ల తరఫు లాయర్ వాదించారు. అయితే తాము సరైన పరిహారమే నిర్ణయించామని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టుకు వివరించారు. రైతులకు డబుల్ బెడ్రూం ఇల్లుగానీ, అది వద్దంటే రూ.5 లక్షలుగానీ ఇస్తున్నామని, భూములకు సంబంధించిన పరిహారం చెక్కులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కానీ రైతులు వాటిని తీసుకోవడం లేదన్నారు. దీనిపై స్పందించిన బెంచ్.. ఆ చెక్కులను హైకోర్టుకు తీసుకురావాలని, తాము రైతులకు అందజేసే ప్రయత్నం చేస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.