మాజీ సైనికుడికి ల్యాండ్ ఇంకెప్పుడిస్తరు?

మాజీ సైనికుడికి ల్యాండ్ ఇంకెప్పుడిస్తరు?
  •     ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
  •     సీసీఎల్​ఏగా ఉన్న సీఎస్​కు రూ. 25 వేల ఫైన్​​


మాజీ సైనికుడికి చట్ట ప్రకారం కేటాయించిన నాలుగు ఎకరాల భూమిని అప్పగించకుండా ఫైళ్లకే పరిమితం చేస్తుండటంపై హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీఎల్ఏగా ఉన్న సీఎస్‌ రెండు వారాల్లోగా ఫైన్‌గా రూ. 25 వేలు చెల్లించాలని లేదంటే స్వయంగా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎంకెపల్లిలోని సర్వే నెంబర్‌ 118లో 4 ఎకరాల భూమిని అప్పగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా అధికారులు కోర్టుధిక్కారానికి పాల్పడ్డారని మాజీ సైనికుడు లక్ష్మీనారాయణ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. చీఫ్‌ జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల బెంచ్‌ సోమవారం విచారణ జరిపింది. కుమ్మరపల్లిలోని సర్వే నెంబర్​55లో 4 ఎకరాలను 2010లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే భూమిని అప్పగించలేదని 2017లో లక్ష్మీనారాయణ హైకోర్టులో రిట్‌వేశారు. భూమిని అప్పగించాలని, కోర్టు ఖర్చుల కింద పిటిషనర్‌కు రూ.25 వేలు చెల్లించాలని సింగిల్​జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను కూడా అమలు చేయకపోవడంతో ఆయన మళ్లీ కోర్టు ధిక్కార రిట్‌వేశారు. ఖర్చుల కింద రూ.25 వేలతోపాటు కోర్టుధిక్కరణ కింద రూ.20 వేలు చెల్లించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిపై రాష్ట్ర సర్కార్‌ అప్పీల్‌పిటిషన్‌ దాఖలు చేసి రెండు వారాల్లోగా సర్వే నెంబర్ 118లోని 4 ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే దాన్ని ఇంకా అమలు చేయలేదని లక్ష్మీనారాయణరెడ్డి మళ్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. సోమవారం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదిస్తూ.. భూమిని గుర్తింపునకు సంబంధించి కలెక్టర్‌ నుంచి సీసీఎల్‌ఏకు పత్రాలు వచ్చాయని, త్వరలోనే భూమిని అప్పగిస్తామన్నారు. ఇదే చివరి అవకాశమని, 2 వారాల్లోగా పిటిషనర్‌కు భూమి అప్పగించాలని లేదంటే తదుపరి విచారణకు సీఎస్‌ హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. గత విచారణలో మినహాయింపు ఇచ్చిన రూ.25 వేలను సీసీఎల్‌ఏ విధులు నిర్వహించే సీఎస్‌ మాజీ సైనికుడికి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌పైనే 150 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయని, తమ ఆధీనంలోని అధికారులతో కోర్టు ఆదేశాలను అమలు చేయించేందుకు సీఎస్‌ ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించింది. విచారణ 2 వారాలకు వాయిదా పడింది.