స్పీకర్, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు  హైకోర్టు నోటీసులు

స్పీకర్, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు  హైకోర్టు నోటీసులు
  • ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరణ

హైదరాబాద్, వెలుగు : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్‌‌ సహా ఇతరులు అందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తొలి ప్రతివాదిగా ఉన్న స్పీకర్, శాసనసభ కార్యదర్శి, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌‌ ప్రకారం స్పీకర్‌‌ నేతృత్వం వహించే ట్రిబ్యునల్‌‌ చైర్మన్, కేంద్ర ఎన్నికల సంఘం, పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌‌ రెడ్డి, కాలె యాదయ్య, బి. కృష్ణమోహన్‌‌రెడ్డి, టి.ప్రకాశ్​గౌడ్, ఎం.సంజయ్​ కుమార్, జి. మహిపాల్‌‌రెడ్డి, అరెకెపూడి గాంధికి నోటీసులు ఇచ్చింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని  ఆదేశించింది. ఈ కేసులో పిటిషనర్‌‌ కోరిన మేరకు మధ్యంతర ఉత్తర్వుల జారీకి  నిరాకరించింది. బీఆర్‌‌ఎస్‌‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌‌ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేఏ పాల్‌‌ వేసిన పిల్‌‌ను సోమవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.శ్రీనివాస్‌‌రావుతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ జరిపింది.

కేఏ పాల్‌‌ వ్యక్తిగతంగా వాదనలు వినిపిస్తూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరారు. ప్రజలు పార్టీ మేనిఫెస్టోను చూసి ఓట్లు వేశారని, ఒక పార్టీ తరఫున గెలిచి మరోపార్టీలోకి మారిపోవడం తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే ప్రజాతీర్పుకు అర్థం లేకుండాపోతుందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జీతభత్యాలు చెల్లించకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్నారు.

ఈ వ్యాజ్యంలో తీర్పు వెలువడేవరకు వారిని అసెంబ్లీలో ప్రవేశించకుండా స్పీకర్‌‌ ఆఫీసుకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. అలాగే చట్టసభలో ఓటింగ్‌‌లో పాల్గొనకుండా చేయాలని కోరారు. అయిదేండ్ల పదవీ కాలం ముగిసే వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చని అన్నారు. మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించిన డివిజన్‌‌ బెంచ్‌‌ ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణలోగా వారంతా కౌంటర్‌‌ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. నాలుగు వారాలకు వాయిదా వేసింది.