
- కోర్టు ధిక్కారం కేసులో ఆర్టీసీ ఎండీ,
- చీఫ్ మేనేజర్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు : కోర్టు ధిక్కారం కేసులో ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) కి బకాయిలు చెల్లించాలని గతంలో ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు విచారించింది. ప్రతివాదులైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చీఫ్ మేనేజర్ బీసీ విజయపుష్పకుమారికి నోటీసులు పంపింది. తదుపరి విచారణకు అడ్వొకేట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ పి.మాధవీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సహకార సంఘానికి ఆర్టీసీ మేనేజ్ మెంట్ రూ.630 కోట్లు చెల్లించాల్సి ఉంది.
దీనిపై సంఘం దాఖలు చేసిన కేసులో 4 వారాల్లో రూ.100 కోట్లు, మరో 4 వారాల్లో రూ. 100 కోట్లు చెల్లించాలని గత నవంబర్‌లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాము రూ.44 కోట్లు చెల్లించామని, నెలకు రూ.10 కోట్లు చొప్పున ఆగస్ట్ నాటికి మిగిలిన మొత్తం చెల్లిస్తామని ఆర్టీసీ ఏప్రిల్ 26న హైకోర్టుకు చెప్పింది. మే 15లోగా రూ 50 కోట్లు, ఆ తర్వాత నవంబర్ నుంచి ఆరు నెలలు లెక్కించి ఆలోగా మిగిలిన రూ.100 కోట్లు చెల్లించాలని ఏప్రిల్ 26న హైకోర్టు ఆర్టీసీ మేనేజ్ మెంట్‌ను ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను మేనేజ్ మెంట్ అమలు చేయలేదంటూ సంఘం దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను ఇటీవల న్యాయమూర్తి విచారించారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.