ఎన్టీఆర్‌‌‌‌ విగ్రహ ఏర్పాటుపై ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ

ఎన్టీఆర్‌‌‌‌ విగ్రహ ఏర్పాటుపై ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ

హైదరాబాద్, వెలుగు: ఖమ్మంలో ఈ నెల 28న ఎన్టీఆర్‌‌‌‌ విగ్రహావిష్కరణ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే జారీ చేసింది. అమెరికాలోని తానా సహకారంతో ఎన్టీఆర్‌‌‌‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. అందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఎన్టీఆర్‌‌‌‌ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉందని.. యాదవులను, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా విగ్రహాన్ని తయారు చేశారని పేర్కొంటూ భారత యాదవ సమితితోపాటు మరో ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ గురువారం విచారించారు. శ్రీకృష్ణుడి రూపంలో  ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్‌‌‌‌ లాయర్ సరసాని సత్యంరెడ్డి, చెలికాని వెంకట యాదవ్‌‌‌‌ కోర్టుకు తెలిపారు. 

విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తానా తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌‌‌‌ వాదించారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ.. విగ్రహంలో పిల్లన గ్రోవి, పింఛం తొలగించామని..విగ్రహ ఏర్పాట్లుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందుకు నిరాకరించిన హైకోర్టు.. కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, విగ్రహ ఏర్పాటు నిర్వాహకులను ఆదేశించింది. విచారణను జూన్‌‌‌‌ 6కి వాయిదా వేసింది.