ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
  •     కాంగ్రెస్‌ కండువాలున్నా స్పీకర్‌ పట్టించుకోలేదు..
  •     అనర్హత పిటిషన్లపై బీఆర్‌ఎస్‌ వాదనలు
  •     విచారణ ఏప్రిల్​ 16కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు హైకోర్టు బుధవారం నోటీసులిచ్చింది. ఫిరాయింపు వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఆదేశించింది. పార్టీ ఫిరాయించారంటూ ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్‌ గౌడ్, ఎ.గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌ రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ ఇటీవల స్పీకర్‌ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 

దీన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌ రెడ్డి, జి.జగదీశ్‌ రెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా.. బుధవారం చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్‌ విచారణ చేపట్టింది. 

బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌ రావు వాదనలు వినిపిస్తూ బీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు సీఎం సమక్షంలోనే కాంగ్రెస్‌ లో చేరారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అన్ని ఆధారాలున్నా స్పీకర్‌ వాటిని పట్టించుకోకుండా పిటిషన్లను కొట్టివేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

దానం నాగేందర్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవిని ప్రభుత్వం కట్టబెట్టిందని గుర్తు చేశారు. సమగ్ర ఆధారాలు సమర్పించినా అనర్హత పిటిషన్లు కొట్టివేశారన్నారు. వాదనలు విన్న బెంచ్‌.. ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా రిజిస్టర్‌ పోస్టులో నోటీసులు పంపడానికి పిటిషనర్లకు అనుమతించింది. దానం నాగేందర్‌పై పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్‌ 16కు వాయిదా వేసింది.