మేజర్ యువతికి..తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉంది : హైకోర్టు

మేజర్ యువతికి..తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉంది : హైకోర్టు
  • లవ్ మ్యారేజీ కేసులో హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: మేజర్ యువతికి తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉందని ఓ లవ్ మ్యారేజీ కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. శక్తిసదన్ నుంచి యువతిని తక్షణం విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. వేర్వేరు కులాలకు చెందిన యువకుడు, -యువతి ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం వివాదాస్పదం అవడంతో యువతిని కస్తూర్భా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న శక్తిసదన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 

తమకు రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను సుమోటోగా హెబియస్ కార్పస్ పిటిషన్‌‌‌‌‌‌‌‌గా స్వీకరించిన హైకోర్టు.. ప్రేమ జంటను, యువతి తల్లిని కోర్టు హాల్‌‌‌‌‌‌‌‌కు పిలిపించి విచారణ జరిపింది. యువకుడితోనే కలిసి జీవించాలని యువతి తన ఇష్టాన్ని స్పష్టంగా వెల్లడించింది. దాంతో మేజర్ అయిన యు వతికి తన ఇష్టానుసారం జీవించే పూర్తి హక్కు ఉందని కోర్టు తెలిపింది. ప్రేమ జంటకు కలిసి జీవించేందుకు అనుమతి ఇచ్చింది. యువతిని తక్షణమే విడుదల చేయాలంటూ శక్తిసదన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.