
హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ భూములుగా నోటిఫికేషన్ ప్రకటించేటప్పుడు రికార్డుల్లో పేర్లు లేకపోతే ఎవరికీ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని వివిధ సర్వే నంబర్లలోని 294 ఎకరాల 20 కుంట్ల భూమి వక్ఫ్ ఆస్తంటూ 1989 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఆ భూమి తమదంటూ హైకోర్టుకు వచ్చినవాళ్ల పేర్లు అప్పుడు రికార్డుల్లో లేవు. 1996లో పిటిషనర్ల పేర్లు రికార్డుల్లోకి ఎక్కించారు. కాబట్టి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు పిటిషనర్లకు నోటీసు ఇవ్వాలనే వాదన చెల్లదు. గెజిట్‌ను సవాల్ చేసిన 27 కేసులూ చెల్లవు.. అని హైకోర్టు జడ్జీ జస్టిస్ పి.నవీన్‌రావ్ ఇటీవల తీర్పు చెప్పారు. గురువారం ఈ జడ్జిమెంట్ ను హైకోర్టు వెబ్ సైట్ లో పొందుపరిచారు. బోడుప్పల్‌లోని సర్వే నెం 45 నుంచి 50, 91, 91ఇఇ, 116లోని 294.20 ఎకరాలు వక్ఫ్ బోర్డువని పేర్కొంటూ గెజిట్ ఇవ్వడంపై గత ఏడాది ఆర్‌ఎన్‌ఎస్ కాలనీ, 18 ఎకరాల్లో వేసిన ప్లాట్స్ ఓనర్లు హైకోర్టులో 27 రిట్లు వేశారు. 400 ఏళ్లుగా వక్ఫ్ రికార్డుల్లో ఉన్న భూమిని ఇటీవల లీజుకు ఇస్తే తమ భూమి అని చెప్పి ఇళ్ల స్థలాలుగా అమ్మేయడం చెల్లదని వక్ఫ్ బోర్డు వాదించింది. ఇళ్ల స్థలాలు కొని మోసపోయామనే కోణంలో న్యాయపోరాటం చేసుకునే హక్కు పిటిషనర్లకు ఉందని, అయితే ఈ కేసులో వాళ్లు చేసే వాదన న్యాయబద్ధంగా లేదని తీర్పులో పేర్కొంది.