హైదరాబాద్, వెలుగు: ఖమ్మం శివారు వెలుగుమట్లలోని ఎస్‌ఆర్ గార్డెన్ వివాదంలో మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు కోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ గార్డెన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని చెప్పింది. ఈ మేరకు జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ నాటికి సర్వే నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు.
వెలుగుమట్లలోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చెందిన భూమి ఉన్నందున ఆ భూమిలో సర్వే చేస్తామంటూ శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డికి అధికారులు ఈ నెల 14న నోటీసులిచ్చారు. దీనిని హైకోర్టులో సవాల్ చేస్తూ ప్రసాద్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే హైకోర్టు గతంలోని ఉత్తర్వులకు విరుద్ధంగా అధికారుల చర్యలు ఉన్నాయన్నారు. సహజ న్యాయ సూత్రాలను కూడా ఉల్లంఘించారని చెప్పారు. తమకు చెందిన భూమిలో అధికారులు జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అధికారులు ఇచ్చిన సర్వే నోటీసును కొట్టేయాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు స్టేటస్‌కో ఆర్డర్ ఇచ్చింది. విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది.
