భూ కేటాయింపుపై వివరాలివ్వండి.. ఆర్​బీఆర్ సొసైటీ కేసులో సర్కార్​కు హైకోర్టు నోటీసులు

భూ కేటాయింపుపై వివరాలివ్వండి.. ఆర్​బీఆర్  సొసైటీ కేసులో సర్కార్​కు హైకోర్టు  నోటీసులు

హైదరాబాద్, వెలుగు:  బుద్వేలులో  ఎకరం రూ.1కి చొప్పున అయిదెకరాల భూమిని రాజా బహద్దూర్‌‌‌‌ వెంకట్‌‌‌‌రామిరెడ్డి (ఆర్​బీఆర్​) ఎడ్యుకేషనల్‌‌‌‌ సొసైటీకి కేటాయించడంపై దాఖలైన పిల్‌‌‌‌ను హైకోర్టు సోమవారం విచారించింది.   భూ కేటాయింపుపై వివరణ ఇస్తూ సమగ్ర వివరాలతో కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.  ఈ మేరకు చీఫ్​ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌ టి.వినోద్‌‌‌‌ కుమార్‌‌‌‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్వేలులో ఎకరం రూ.1 చొప్పున సర్వే నెం. 325/3/2లో 5 ఎకరాల భూమిని  కేటాయిస్తూ 2018 సెప్టెంబరు 9న  సర్కార్​ జీవో 105 జారీ చేసింది.

 ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ సికింద్రాబాద్‌‌‌‌కు చెందిన సామాజిక కార్యకర్త కె.కోటేశ్వర్‌‌‌‌రావు, ఇతరులు హైకోర్టులో పిల్​దాఖలు చేశారు.  వీరి తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ.. భూమి కేటాయింపు  జీవో విషయం తెలిసిన తర్వాత ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ బి.ఎస్‌‌‌‌.ప్రసాద్‌‌‌‌ వాదనలు వినిపిస్తూ భూ కేటాయింపునకు తగిన కారణాలున్నాయని, దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్‌‌‌‌ దాఖలు చేస్తామని చెప్పారు. వాదనల అనంతరం  రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, రాజా బహద్దూర్‌‌‌‌ వెంకట రామిరెడ్డి ఎడ్యుకేషనల్‌‌‌‌ సొసైటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.