మూసీ పొల్యూషన్ పై హైకోర్టు సీరియస్

మూసీ పొల్యూషన్ పై హైకోర్టు సీరియస్

హైదరాబాద్‌‌: కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం మురికి కూపంలా మారిన మూసీ నదిని మాత్రం ఎందుకు పట్టిం చుకోవడంలేదని హైకోర్టు నిలదీసింది. మూడు నెలల్లోగా మూసీలో ఐదు కిలోమీటర్ల పరిధిని శుభ్రం చేస్తామని ‘మూసీ
అభివృద్ధి మండలి’ ఇచ్చిన హామీని ఎందుకు నిరవేర్చలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మూసీ పొల్యూషన్, దాని ప్రభావాలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా దాఖలైన పిల్​ను చీఫ్ జస్టిస్​ ఆర్ఎస్​ చౌహాన్​, జస్టిస్‌ అభిషేక్‌‌రెడ్డి డివిజన్​ బెంచ్ సోమవారం విచారించింది.

మూసీ విషయంలో ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని బెంచ్ .. ఈ మేరకు చీఫ్‌‌ సెక్రటరీ, మున్సిపల్, పరిశ్రమలు, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ ఎంసీ, జలమండలి, పీసీబీ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి- భువనగిరి జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.

గతంలో కోర్టులు ఇచ్చిన స్టేల కారణంగానే పనులు ముందుకు సాగడంలేదన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన బెంచ్ .. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా జడ్జిలు కీలక కామెంట్లు చేశారు. హుస్సేన్​ సాగర్​లో పొల్యూషన్​పె రగడానికి వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా కారణమని, మంచి నీటి వనరులు పూర్తిగా పాడైపోవడానికి అందరూ బాధ్యులేనని జడ్జిలు అన్నారు.