గోల్కొండ కోట ప్రహరీ నిర్మాణం ఎంత వరకొచ్చింది?

గోల్కొండ కోట ప్రహరీ నిర్మాణం ఎంత వరకొచ్చింది?
  • చారిత్రక కట్టడాల పరిరక్షణపై నివేదిక ఇవ్వండి
  • కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : గోల్కొండ కోట చుట్టూ చేపట్టిన గోడ నిర్మాణం ఏ దశలో ఉందో చెప్పాలంటూ కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటితోపాటు హైదరాబాద్ సిటీలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ నివేదికివ్వాలని స్పష్టం చేసింది.  విచారణను వాయిదా వేసింది. కుతుబ్‌‌షాహి టూంబ్స్, గోల్కొండ కోట నిర్వహణలో నిర్లక్ష్యంపై ఓ పత్రికలో వచ్చిన కథనంతోపాటు,  గోల్కొండ చుట్టూ గోడ నిర్మాణ బాధ్యతలు ప్రైవేటు సంస్థకు ఇవ్వడంపై పిల్‌‌లు దాఖలయ్యాయి.

వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.అనిల్‌‌కుమార్‌‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. గోల్కొండ కోట, కుతుబ్‌‌షాహి టూంబ్స్‌‌తోపాటు మిగిలిన 25 కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. గోల్కొండ కోట చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. దీనిపై ప్రైవేటు వ్యక్తుల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 ప్రైవేటు స్థలాల్లో ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. బెంచ్ స్పందిస్తూ  ప్రైవేటు స్థలాల్లో నిర్మాణాలను చేపట్టవద్దని తెలిపింది. ప్రైవేటు స్థలాల్లో జోక్యం చేసుకుంటే చట్టప్రకారం నిర్మాణాలను అడ్డుకోవచ్చంది. ప్రహరీ నిర్మాణంపై నివేదికివ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.