జులై 21 కల్లా.. వెయ్యి కోట్లు కట్టాల్సిందే

జులై 21 కల్లా.. వెయ్యి కోట్లు కట్టాల్సిందే
  • సీసీఎస్ బకాయిలపై ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల జీతాల నుంచి నెలనెలా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) కింద డబ్బులు కట్ చేస్తున్నా.. ఆ డబ్బులను సీసీఎస్ ఖాతాలో జమ చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. సీసీఎస్ కు ఆర్టీసీ చెల్లించాల్సిన రూ. 1,050 కోట్లను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. డబ్బులు జమ చేసేందుకు జులై 21 వరకు గడువును విధించింది. కార్మికుల జీతాల నుంచి సీసీఎస్ పేరుతో కట్ చేస్తున్న డబ్బులను ఆర్టీసీ రెండేండ్లుగా సీసీఎస్ కు ఇవ్వడంలేదు. దీంతో అసలు, వడ్డీ కలిపి మొత్తం బకాయిలు రూ.1,050 కోట్లకు చేరాయి.

ALSO READ: కాంగ్రెస్​లో టికెట్​ వార్..జూపల్లి, కూచుకుళ్ల పార్టీలో చేరక ముందే మొదలైన లొల్లి

బకాయిల వసూలు కోసం గతేడాది నుంచి పలు సార్లు హైకోర్టులో సీసీఎస్ పిటిషన్లు దాఖలు చేసింది. ఆర్టీసీకి హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. గడువులోగా బకాయిలు చెల్లించకపోవటంతో సీసీఎస్ ఇటీవల కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఆర్టీసీ నిధులు కట్టలేదని, దీంతో కార్మికులకు లోన్లు ఇవ్వలేకపోతున్నామని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీసీఎస్ పేర్కొంది. పిటిషన్ ను విచారించిన హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవిదేవి 4వారాల గడువు ఇచ్చారు. ఈ గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఆర్టీసీపై చర్యలకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.