
హైదరాబాద్, వెలుగు : నిబంధనలకు వ్యతిరేకంగా జాగాకు ఎన్వోసీ ఇచ్చిన గత ఎన్వోసీ కమిటీ చైర్మన్, హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్‌పై ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా గుడిమల్కాపూర్, నానల్ నగర్‌లో తాను కొనుగోలు చేసిన 5,262 చదరపు గజాల స్థలానికి తప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలోని కమిటీ ఎన్వోసీ ఇచ్చిందని 2011లో శాంతి అగర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్వోసీని రద్దు చేశారు. అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్, జాయింట్ కలెక్టర్ వీవీ దుర్గాదాస్. తహపీల్దార్లు ఎం. వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొన్నారు. తప్పుడు పత్రాలతో స్థలాన్ని దక్కించుకునే ప్రయత్నం చేసిన ప్రైవేటు వ్యక్తులపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ తీర్పుపై అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు అప్పీల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది.
సీనియర్ లాయర్ జె. ప్రభాకర్ వాదిస్తూ, నవీన్ మిట్టల్‌పై చర్యలు తీసుకోలేదని, చార్జిమెమో ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పారు. మిట్టల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే కొట్టేసిందని, అయినా అధికారులు ఆయనతోపాటు ఇతరులపై చర్యలు తీసుకోలేదన్నారు. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రతివాదన చేస్తూ.. కలెక్టర్ శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారని చెప్పారు. అయితే, ఆ చర్యలు ఏ దశలో ఉన్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.