మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్​పై.. విచారణ స్పీడప్ చేయాలి

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్​పై.. విచారణ స్పీడప్ చేయాలి
  • అడ్వకేట్ కమిషన్​కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మహబూబ్​నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్​ గౌడ్​పై దాఖలైన ఎలక్షన్ పిటిషన్​పై విచారణ వేగవంతం చేయాలని అడ్వకేట్ కమిషన్​ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 11వ తేదీ దాకా ఎంక్వైరీ కంప్లీట్ చేసి నివేదిక అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వకేట్ కమిషనర్ ముందు సాక్షులను ప్రవేశపెట్టాలని సూచించింది. మహబూబ్‌నగర్‌ సబ్‌ రిజిస్ట్రార్, రాణిగంజ్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజర్, ఎర్రగడ్డ ఎస్‌బీఐ మేనేజర్, మహబూబ్‌నగర్‌ జిల్లా బండమేడి ఆర్‌టీవోలను ఈ నెల 6న హాజరుకావాలని ఆదేశించింది. 8న మెదక్‌ జిల్లా ఆర్డీవో, 11న నల్గొండ జిల్లా అడిషనల్‌ కలెక్టర్లు హాజరై వివరాలు తెలియజేయాలని ఆదేశించింది. 

దీనికనుగుణంగా వ్యక్తిగతంగా నోటీసులివ్వాలని రిజిస్ట్రీకి జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ ఆదేశించారు. సాక్షుల నుంచి సేకరించిన వివరాలను సీల్డ్‌ కవర్‌ లో అందజేయాలని అడ్వకేట్ కమిషనర్‌కు సూచించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు శ్రీనివాస్​గౌడ్ తన అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని మహబూబ్‌నగర్‌కు చెందిన సీహెచ్‌ రాఘవేంద్ర రాజు 2019లో హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకసారి అఫిడవిట్‌ దాఖలు చేశాక దాన్ని వాపస్‌ తీసుకుని సవరించి మరోసారి సమర్పించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ చెప్పారు. ఈ క్రమంలో విచారణను ఈ నెల 12కు వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు  ఇచ్చింది.